28 రోజుల్లో 250 కోట్ల క్లబ్ లో

0

షాహిద్ కపూర్ హీరోగా తెలుగు కుర్రాడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన `కబీర్ సింగ్` బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి`ని మించి ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్ జాబితాలో చేరింది. షాహిద్ కెరీర్ లో తొలి సోలో 100 కోట్ల క్లబ్ సినిమాగా రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఆర్.రాజ్ కుమార్ (2013) తర్వాత షాహిద్ కి సోలో హిట్ చిత్రం ఇదే కావడం గమనార్హం.

ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సామాజిక మాధ్యమాల్లో `కబీర్ సింగ్` రికార్డుల గురించి ప్రస్థావిస్తూ.. ఈ సినిమా నాలుగు వారాల్లో 250 కోట్లు వసూలు చేసిందని తెలిపారు. జూన్ 21న రిలీజైన ఈ చిత్రం ఈ శుక్రవారం నాడు 2.54 కోట్లు వసూలు చేసింది. మొత్తం 252.14 కోట్లు కొల్లగొట్టిందని తరణ్ ట్వీట్ చేశారు. యూరి.. భారత్ చిత్రాల తర్వాత బాలీవుడ్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీగానూ కబీర్ సింగ్ పేరు ప్రస్తుతం మార్మోగుతోంది.

వివాదాలు సైతం ఈ సినిమా వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపించలేదని ఈ సందర్భంగా తరణ్ అన్నారు. మహిళల్ని కించపరిచేలా ఉందని విమర్శలు వస్తున్నా అదేదీ కలెక్షన్ల దూకుడును ఆపలేదని తెలిపారు. కబీర్ సింగ్ ఒక మోడ్రన్ దేవదాస్ తరహా కథాంశమన్న పోలిక బాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన `సూపర్ 30`కి క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ సినిమా తొలి రోజు 12కోట్లు వసూలు చేసిందని.. తొలి వీకెండ్ వసూళ్లు బావుంటాయని తరణ్ వెల్లడించారు. అయితే సూపర్ 30 ప్రభావం `కబీర్ సింగ్` పై ఏమాత్రం లేదని అర్థమవుతోంది. ఇక ఇదే దూకుడు కొనసాగిస్తే సునాయాసంగానే 250 కోట్ల క్లబ్ నుంచి 300 కోట్ల క్లబ్ లో చేరడం కబీర్ సింగ్ కి కష్టమేమీ కాదని అర్థమవుతోంది.
Please Read Disclaimer