నిప్పుతో చందమామ చెలగాటం

0

అందాల చందమామ కాజల్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ అమ్మడు ఇటీవల రెగ్యులర్ కాన్సెప్టులకు సంతకాలు చేసేందుకు పదే పదే ఆలోచిస్తోంది. కమర్షియాలిటీని మించి తనను తాను నిరూపించుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆ క్రమంలోనే ఎంచుకునే కథాంశంలో తన పాత్రకు ప్రాధాన్యత ఎంత అన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతోంది.

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ రీమేక్ లో కాజల్ సంతకం చేయడానికి కారణమిదే. `పారిస్ పారిస్` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంలో భారీగా రిలీజ్ కానుంది. అలాగే కమల్ హాసన్ సరసన `భారతీయుడు 2` చిత్రానికి కాజల్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా మర్మకళను కళరియపట్టు అనే అరుదైన విద్యను నేర్చుకుంటోందని ఇదివరకూ వార్తలొచ్చాయి. కాజల్ డేరింగ్ ఫీట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు `సీత` చిత్రంలోనూ ప్రయోగాత్మక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఫక్తు కమర్షియల్ యాటిట్యూడ్ ఉన్న బిజినెస్ వుమెన్ పాత్రలో మైమరిపించబోతోంది.

ఈలోగానే తమిళంలో `కోమలి` అనే మరో భారీ చిత్రానికి కాజల్ సంతకం చేసింది. ఆ సినిమా సెట్స్ నుంచి నేరుగా కాజల్ డేరింగ్ యాటిట్యూడ్ కి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ వీడియోలో కాజల్ ఫైర్ ఆక్రోబాట్స్ తో బెంబేలెత్తిస్తోంది. చేతిలో ఉన్న కాగడాల చక్రాన్ని ఏమాత్రం భయపడకుండా గిరగిరా తిప్పేస్తూ మైమరిపిస్తోంది. అలా చేసేప్పుడు కాజల్ ముఖంలో ఎక్కడా భయం అన్నదే కనపించలేదు. ఆ మంటల్ని చూసి అయినా అసలు అదరలేదు.. బెదరలేదు. దీంతో కాజల్ గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారంతా. నిప్పుతో చెలగాటం ఆడుతున్న కాజల్ గట్స్ వహ్వా అంటున్నారు. నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వాటిని తెరపై ప్రదర్శించడం .. ఇది మాత్రమే తనకు తెలుసు అని అర్థమవుతోంది. స్పార్టన్లు ఎప్పుడూ భయపడరు. కాజల్ కూడా అంతే అన్నమాట.