‘కాజల్ వెడ్స్ గౌతమ్’.. పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన చందమామ…!

0

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నిన్నటి నుంచి మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ కాజల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పెళ్లి డేట్ ని ప్రకటించింది. ‘నేను ఎస్ చెప్పాను’ అని పోస్ట్ పెట్టిన కాజల్.. 30 అక్టోబర్ 2020 తేదీన గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ముంబైలో ఈ వివాహం జరగనుందని.. పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు సహా అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిపింది. మేము కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించడం థ్రిల్ గా ఫీల్ అవుతున్నామని.. మీ ఆశీర్వాదాలు కావాలని కోరింది. అలానే ఇన్నాళ్ళుగా తనని ఆదరించి తన మీద ప్రేమను కురిపించిన వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేసింది. అంతేకాకుండా సినిమాల్లో కొనసాగుతానని.. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ప్రకటించింది.

కాగా నిన్నటి నుంచి ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని కాజల్ వివాహం చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఇరువురి కుటుంబ పెద్దల అంగీకారం మేరకు నిశ్చితార్థం కూడా పూర్తయిందని.. ముంబైలో వీరి వివాహం జరగనుందని పేర్కొన్నారు. అందులోనూ నిన్న కాజల్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఆమెకు పెళ్లి కుదిరింది నిజమేనేమో అని హింట్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ నెల 30న పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ కిచ్లు ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ మరియు వ్యాపారవేత్త. ఫాబ్ ఫర్నిష్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన గౌతమ్.. ‘ది ఎలిఫెంట్’ అనే లైఫ్ స్టైల్ బ్రాండ్ కంపెనీకి సీఈఓగా కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘డిస్కెర్న్ లివింగ్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు.