వివాదాంశం పై సినిమాకు హీరోయిన్ సిద్దం

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ పలువురు స్టార్ హీరోలతో వైరం పెట్టుకున్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్ ఒక వైపు దర్శకురాలిగా మరో వైపు నిర్మాతగా టర్న్ అయ్యేందుకు సిద్దం అవుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాను నటించే ప్రతి సినిమా డైరెక్షన్ విభాగంలో వేలు పెట్టే కంగనా రనౌత్ ఈసారి పూర్తిగా డైరెక్షన్ చేసేందుకు సిద్దం అవుతుందంటూ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలో కథనం వచ్చింది. ఆ కథనం ప్రకారం వివాదాస్పద అంశం అయోధ్య రామ మందిరం నేపథ్యంలో సినిమా ఉంటుందట.

అయోధ్య రామ మందిరం మరియు బాబ్రీ మసీదు వివాదం కాన్సెప్ట్ తో ‘అపరాజిత అయోధ్య’ అనే టైటిల్ తో సినిమాను చేసేందుకు ఈమె సిద్దం అయ్యింది. ఈ సినిమాకు మన జక్కన్న రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. యదార్థ కథకు కాస్త కల్పితాన్ని జత చేసి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి కేవలం చర్చలు మాత్రమే జరుగుతున్నాయట.

వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రకటించి మొదలు పెట్టే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ ట్విట్టర్ లో స్పందిస్తూ కంగనా నిర్మాతగా మారబోతుంది అంటూ ప్రకటించింది. ఇదే సరైన సమయంగా భావిస్తున్నాం.

అపరాజిత అయోధ్య చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం మంచి ఆరంభంగా కంగనా భావిస్తుందని రంగోలీ పేర్కొంది. ప్రస్తుతం ‘తలైవి’ చిత్రంలో నటిస్తున్న కంగనా ఆ తర్వాత అపరాజిత అయోధ్య సినిమాను చేయనుంది. మరి ఆ చిత్రంకు కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తుందా లేదంటే నటించడం కూడా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer