ప్లీజ్.. నన్ను బ్యాన్ చేయండి.. కంగనా షాకింగ్ మెసేజ్!

0

మొహమాటం లేకుండా మాట్లాడేవారు కొందరుంటారు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బందేమంటే.. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. ఎక్కడా షుగర్ కోటింగ్ ఉండదు. నిజం చేదుగా ఉంటుదన్నట్లుగా వారి మాటలు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఇబ్బందినే పదే పదే బాలీవుడ్ నటి కంగనా కారణంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. తన సహ నటుల దగ్గర నుంచి తాను పని చేసే వారి వరకు చాలామందితో ఆమెకు ఏదో ఒక వివాదం ఉంటుంది. తాజాగా ఆమె మీడియాలోని కొంతమంది జర్నలిస్టుల విషయంలోనూ ఆమె వివాదం చోటుచేసుకుంది. దీంతో.. ఇప్పుడీ విషయం అంతకంతకూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. కంగనా తన తీరు మార్చుకోకపోతే ఆమెను బ్యాన్ చేస్తామంటూ ఎంటర్ టైన్ మెంట్ మీడియా గిల్డ్ సభ్యులు హెచ్చరించారు. తాజాగా ఆమె నటించిన జడ్జిమెంటల్ హై క్యా సినిమా ప్రచారంలో భాగంగా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జర్నలిస్టుల్లో ఒకరిని ఉద్దేశించి కంగనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా సదరు రిపోర్టర్ కు అండగా మరికొందరు రిపోర్టర్లు చేరారు. అయినప్పటికీ ఆమె వారికి వెరవకుండా.. తప్పుడు రాతలు రాస్తారంటూ తప్పు పట్టారు.

కంగనా వ్యవహరించిన తీరు ఏ మాత్రం బాగోలేదంటూ పలువురు తప్పు పడుతున్న వేళ.. జరిగిన దానికి కంగనా క్షమాపణలు చెప్పకుంటే ఆమె మీద బ్యాన్ విధిస్తామంటూ ఎంటర్ టైన్ మెంట్ మీడియా గిల్డ్ హెచ్చరించింది. అందుకు రిప్లై అన్నట్లు తాజాగా ఆమె ఒక ట్వీట్ వీడియోను పోస్ట్ చేశారు. తనకు మీడియాలో మంచి స్నేహితులు కొందరు ఉన్నారని.. అన్ని రంగాల్లో మాదిరే మీడియాలోనూ కొందరు ఉన్నారని.. వారి మీదనే తప్పించి తనకు మరెవరి మీదా ఆగ్రహం లేదన్నారు.

తనను ఎల్లప్పుడు ప్రోత్సహించిన విలేకరులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో వారి భాగస్వామ్యం కూడా ఉందన్నారు. అలాంటి వారికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. మీడియాలోని కొన్ని వర్గాలు ఉన్నాయని.. అలాంటి వారంతా దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. పదో తరగతి తప్పిన వారు కూడా మీడియాలో ఉన్నారన్న ఆమె.. కొందరు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నట్లు మండిపడ్డారు.

ఇలాంటి వారికి దేశం మీద ఎలాంటి భక్తి ఉండదని.. అలాంటోళ్లంతా నాకు భక్తి లేదని విరుచుకుపడుతుంటారన్నారు. ఇటీవల తాను పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈషా ఫౌండేషన్ తో కలిసి ఒక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నానని.. జంతు పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ లో కూడా పార్టిసిపేట్ చేశానని.. తనపై జోకులు వేస్తూ రాతలు రాసిన వైనాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వాళ్లు తమను తాము విలేకరులమని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. తనను దయచేసి నిషేధించాలని.. ఆమె ఆయా వర్గాల వారిని వేడుకోవటం గమనార్హం.

తాను తిట్టింది.. ఆగ్రహం వ్యక్తం చేసింది కొద్దిమందేనని.. అలాంటిది తనపై బ్యాన్ విధిస్తానన్న మాటకు ఆమె తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. క్వీనా మజాకానా?
Please Read Disclaimer