బాలీవుడ్ క్వీన్.. సేమ్ సీన్ రిపీట్ అయిందిగా

0

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు నటిగా ఎంత మంచి పేరు ఉంతో ప్రవర్తన విషయంలో అంత చెడ్డపేరు ఉంది. మొదట్లో కంగనాను వెనకేసుకొని వచ్చే జనాలు ఎక్కువమందే ఉండేవారు. వారందరూ.. “బాలీవుడ్ భూస్వాములు చేసే అరాచకాలకు చరమగీతం పాడే ఉద్యమ తార కంగన” అనే అభిప్రాయంలో ఉండేవారు. కానీ మెల్లగా ఆ అభిప్రాయం పొరపాటని.. తన సినిమా రిలీజుకు ముందే ఎవరినో ఒకరిని కెలికి గొడవలు పెట్టుకోవడం కంగనాకు అలవాటని మద్దతుదారుల్లో చాలామందికి అర్థం అయింది. ఇక కంగనా సోదరి రంగోలి సంగతి తెలిసిందే. అయినదానికీ కానిదానికి ఆవేశపడిపోతూ.. ఊళ్ళో జనాల మీద నోరు పారేసుకుంటూ కంగనాకు వీలైనంత చెడ్డ పేరు తీసుకురావడంలో విజయం సాధించింది.

ఇదంతా ఒక తీరు అయితే.. కంగనా పని చేసే సినిమాల విషయంలో అంతా తానై వ్యవహరిస్తూ మిగతావారికి రావాల్సిన క్రెడిట్ ను కూడా కబ్జా చేయడంలో స్పెషలిస్టు అనిపించుకుంటోంది. ‘మణికర్ణిక’ విషయంలో కంగనా – క్రిష్ మధ్యలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో క్రిష్ వైపు కూడా తప్పు ఉందని.. సినిమా రిలీజ్ కు ముందే వదిలేయడం సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే కంగనా ‘మణికర్ణిక’ మొత్తం సినిమాకు నేనే కర్త కర్మ క్రియ అనే తరహాలో క్రెడిట్ తీసుకుంది. ఇక తాజాగా ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రం విషయంలో కూడా అదే జరుగుతోంది.

ఈ సినిమాకు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి అనే సంగతి తెలిసిందే. ప్రకాష్ ఇప్పటివరకూ టేకప్ చేసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. ఈ సినిమా సక్సెస్ సాధించింది కానీ ఒక్క ప్రెస్ మీట్ లో కూడా ప్రకాష్ కనిపించలేదు. అన్నీ ప్రమోషన్ కార్యక్రమాల్లో కంగనానే. కంగనా పేరుమీదే బిజినెస్ జరుగుతుంది అనేది వాస్తవమే కానీ డైరెక్టర్ పేరే ఎత్తకుండా క్రెడిట్ మొత్తం తన ఖాతాలో పడేలా చేసుకుంటోంది. తెలుగు ప్రేక్షకును ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా డైరెక్టర్ ఎవరని అడిగితే.. జవాబు చెప్పగలుగుతున్నారు కానీ హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగితే అంటే తెల్లమొహం వేస్తారు. ఎక్కువ మాట్లాడితే “ఎవరైతే ఏం.. డైరెక్షన్ చేసేది కంగనానే కదా” అనేలా ఉన్నారు. ప్రకాష్ కూడా ఈ సక్సెస్ ను గట్టిగా ప్రొజెక్ట్ చేసుకోకుండా కామ్ గా ఉండడంతో కంగనా పని ఇంకా సులువయింది..!
Please Read Disclaimer