బాలీవుడ్ సినిమాపై ఆ కులానికి మళ్లీ కోపమొచ్చింది!

0

ఉత్తరాదిన రాజపుత్ర రాజుల గురించి – మధ్యయుగం నాటి రాజకుటుంబాల గురించి వచ్చే సినిమాలపై జరిగే రాద్ధాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి గత కొన్నేళ్లలో ఈ తీవ్రత మరింత ఎక్కువ అయ్యింది. ఆ మధ్య వచ్చిన పద్మావతి సినిమా విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలిసిందే!

అంతకు ముందు బాజీరావ్ మస్తానీ సినిమా విషయంలోనూ రచ్చ జరిగింది. చారిత్రాత్మక పాత్రల గురించి సినిమాల్లో వక్రీకరిస్తూ ఉన్నారని అక్కడ కొన్ని కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడం కొత్త కాదు. ఆయా సినిమాల షూటింగులను అడ్డుకోవడం కూడా జరిగింది. వారి ఆందోళనలు తీవ్రతరం కావడంతో ప్రభుత్వాలు కూడా స్పందించే పరిస్థితి వచ్చింది.

పద్మావతి సినిమా విషయంలో వివిధ రాష్ట్రాలు నిషేధం విధించాయి. కుల సంఘాలు – కర్ణిసేన అనే సంస్థ.. వంటి వాటి నుంచి వ్యక్తం అయిన అభ్యంతరాల నేపథ్యంలో… ఆ సినిమాపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయితే ఆ మూవీ మేకర్లు వెనక్కు తగ్గారు. తమ సినిమాకు పేరు మార్చారు. చరిత్రతో సంబంధం లేదని ప్రకటనలు చేసుకోవాల్సి వచ్చింది.

అలా అనేక రిపేర్ల తర్వాత పద్మావతి పేరును పద్మావత్ గా మార్చి ఎలాగోలా విడుదల చేశారు. అయితే అప్పటికే జరిగిన లేట్ తో ఆ సినిమాకు నష్టం జరిగింది. ఆ సంగతలా ఉంటే.. ఉత్తరాది కులసేనల – కర్ణిసేనల అభ్యంతరాలు ఇప్పుడు మరో సినిమా వైపు మెళ్లాయి. ఈ సారి మహారాజా పృథ్విరాజ్ మీద రూపొందుతున్న సినిమా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమా రూపొందుతూ ఉంది. పృథ్విరాజ్ పాత్రను ఈ సినిమాలో వక్రీకరిస్తున్నారని అతడిని ఒక ప్రేమికుడిగా చూపుతూ ఔచిత్యాన్ని దెబ్బతీస్తున్నారని కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతే కాదు.. జైపూర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అక్కడ కర్ణిసేన వాళ్లు ప్రత్యక్షం అయ్యి – దాడి చేశారట. షూటింగును అడ్డుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఉత్తరాదిన మరో సినిమాపై కుల సంఘాల ఒత్తిడి ప్రారంభం అయినట్టుంది!
Please Read Disclaimer