కేసీఆర్ ఇంకో సంచలనం..ఏకంగా ఉద్యోగులకే షాక్!

0

”ఆగస్టు 15 నుంచి అసలు పాలన అంటే ఏంటో చూస్తారు“తెలంగాణ ముఖ్యమంత్రి – టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసిన సంచలన ప్రకటన ఇది. తనదైన శైలిలో పరిపాలన చేసే కేసీఆర్ ఆగస్టు 15 నుంచి ఎలాంటి సంచలనాలకు తెరలేపనున్నారనే చర్చ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు…ఓ ప్రధాన ఉద్యోగుల వర్గం తీవ్రంగా కలవరపాటుకు గురవుతోంది.

రెవెన్యూశాఖ గురించి ప్రస్తావించిన సందర్భాలలో వీఆర్ఓలవైపు కేసీఆర్ వేలెత్తి చూపుతుండడంతో తమ పోస్టులకు ముప్పు వాటిలినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తోన్న 4700 మంది వీఆర్ ఓలు భావిస్తున్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిందని – వీరిని సంస్కరించకపోతే రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఈ నేపథ్యంలోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో కీలకమైన వీఆర్వోల వ్యవస్థ అవినీతి కేంద్రబిందువుగా మారిందనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీనికితోడు వీఆర్వోలుగా పదోన్నతులు పొందిన మరికొందరు.. చట్టంపై అవగాహన లేక తప్పుల తడకగా రికార్డులు నమోదు చేయడం కూడా భూ వివాదాలకు దారితీసింది. ఈ పరిణామాలతో రెవెన్యూ వ్యవస్థపై ప్రజల్లో ఒకరకమైన దురభిప్రాయం ఏర్పడిందని కేసీఆర్ భావిస్తున్నారు. భూమి రికార్డును ఆన్ లైన్ లో నమోదుచేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకోవడానికి వీఆర్వోను పురమాయించి.. ఏసీబీకి చిక్కిన తహశీల్దార్ లావణ్య ఉదంతాన్ని ప్రస్తావించిన కేసీఆర్ పార్టీ నేతలతో తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి కొనసాగింపుగా తాజాగా అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు వీఆర్ ఓ వ్యవస్థ పట్ల ఉన్న ఆగ్రహాన్ని చాటిచెప్తున్నాయి. సీఎం – సీఎస్ – భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు లేని అధికారాలు వీఆర్ ఓల కున్నాయని శాసనసభ సాక్షిగా సీఎం వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది.

భూ రికార్డుల ప్రక్షాళన సమయం నుంచి కేసీఆర్కు వీఆర్ ఓలపై ఆగ్రహం వ్యక్తమవుతోందని సమాచారం. పట్టాదార్ పాస్ పుస్తకాలు రాకపోవడం.. తాతల కాలంనాడే భూములమ్ముకున్న వారి పేర్లతో పాస్ పుస్తకాలు జారీ కావడంలాంటి సంఘటనలు చోటుచేసు కున్నాయి. దీంతో ఆఖరికి భూ రికార్డుల ప్రక్షాళన లక్ష్యం కాస్తా పక్కదారి పట్టింది. ఈ పరిణామాలన్నింటిపై ఇంటెలిజెన్స్ విభాగంతో వివరాలు తెప్పించుకున్న సీఎం.. రెవెన్యూశాఖలో అవినీతి పెరిగిపోయిందని ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేననే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తు చేస్తున్న సర్కారు.. భూ వివాదాలకు తావివ్వకుండా టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఓవైపు కొత్త చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై అధ్యయనం చేపడుతూనే పాలనాపరమైన సంస్కరణలు చేపట్టే దిశగా నిపుణుల కమిటీతో చర్చిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ స్థాయిలో ఉన్న వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి.. ఉద్యోగులను పంచాయతీరాజ్ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేస్తే సరిపోతుందనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ వ్యాఖ్యలు – అంతర్గతంగా సాగుతున్న పరిణామాలు వీఆర్ ఓలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్న తమను అవమానించేలా సీఎం మాట్లాడారని వీఆర్ ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావు వాపోయారు.సీఎం వ్యాఖ్యల కారణంగా ప్రజల్లో తమకు గౌరవం లేకుండా పోతుందని – సామాజిక భద్రత కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

చిరుద్యోగులైన తమపై కక్షసాధింపునకు పాల్పడడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నుంచి ఈనెల 27వరకు వర్క్ టూ రూల్ పాటిస్తున్నామని – నల్లబ్యాడ్జీ లతో వీఆర్ ఓ లందరూ విధులకు హాజరవుతున్నారని తెలిపారు.
Please Read Disclaimer