కీర్తి అందమైన ఫ్యామిలీని చూశారా?

0

చూస్తుండగానే 20 సినిమాల కథానాయిక అయ్యింది కీర్తి సురేష్. పైలట్స్ (2010) అనే బాలల చిత్రంతో సినీఆరంగేట్రం చేసిన కీర్తి ఇంతింతై అన్న చందంగా ఎదిగిన తీరు ఆసక్తికరం. 2002లో గీతాంజలి అనే మలయాళ చిత్రంతో కథానాయిక అయ్యింది. అటుపై రామ్ సరసన `నేను శైలజ` (2015) అనే తెలుగు చిత్రంలో నటించి మన యూత్ గుండెల్లో తిష్ఠ వేసింది. ఈ నాలుగేళ్లలోనే చకచకా డజను పైగా చిత్రాల్లో నటించేసింది. ఇప్పటికి 20 సినిమాల కథానాయిక అయ్యింది. నాలుగైదేళ్లలో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. కెరీర్ లో నేను శైలజ – మహానటి – పందెంకోడి 2 వంటి చిత్రాలు తనకు నటిగా మంచి గుర్తింపును – పేరును తెచ్చాయి. ఇటీవలే సర్కార్ చిత్రంలోనూ ఆసక్తికర పాత్రలో నటించి మెప్పించింది.

`మహానటి` లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత కీర్తి కెరీర్ స్కైలోకి దూసుకెళుతుందని భావించారంతా. కానీ అనుకున్నదొకటి అయినదొక్కటి. ఈ అమ్మడు సెలక్టివ్ గా ముందుకు వెళుతోంది. గ్లామర్ ఎలివేషన్ ను మించి.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకే ప్రాధాన్యతనిస్తోంది. కీర్తి పక్కా ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే ఎంచుకుంటోందని అర్థమవుతోంది. ప్రస్తుతం 118 నిర్మాతలు తెరకెక్కిస్తున్న సినిమాలో కీర్తి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తన కెరీర్ కి 20వ సినిమా. తాజాగా ఆన్ లొకేషన్ నుంచి ఓ స్టిల్ ని కీర్తి షేర్ చేసింది. ఈ ఫోటోలో నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ – సీనియర్ నరేష్ – కమల్ కామరాజు – నదియా కనిపిస్తున్నారు. వీళ్లంతా ఈ చిత్రంలో కీర్తి కుటుంబ సభ్యులుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి అందమైన ఫ్యామిలీ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా తర్వాత కీర్తి ఏ చిత్రంలో నటించనుంది? అంటే .. పందెంకోడి 3లో నటించే వీలుందని తెలుస్తోంది. విశాల్ – కీర్తి జంటగా `పందెంకోడి 3` స్క్రిప్టు ను లింగుస్వామి ఇప్పటికే రెడీ చేస్తున్నారు. గత ఏడాది పందెంకోడి 2 రిలీజ్ సమయంలో ఈ ఫ్రాంఛైజీలో తదుపరి చిత్రానికి కీర్తిని ఇప్పుడే లాక్ చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్క్రిప్టు రెడీ చేస్తున్న లింగు స్వామి పార్ట్ 3లోనూ కథానాయిక పాత్రకు చక్కని ఐడెంటిటీ ఉండేలా తీర్చిదిద్దుతున్నారట. అంటే కీర్తికి కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బూస్ట్ నిచ్చే క్యారెక్టర్ దక్కనుందని భావించవచ్చు. మలయాళ మల్టీస్టారర్ మరక్కర్ లోనూ కీర్తి కథానాయికగా నటిస్తోంది.
Please Read Disclaimer