‘కేజీఎఫ్-2’ టీమ్ కి కోర్టు ఝలక్

0

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన కేజీఎఫ్ ఎంతటి సంచలనమో తెలిసిందే. `కేజీఎప్ -చాప్టర్1` బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్1 ని మించిన బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా అతడు ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నారో తెలియజేసే `అధీరా` ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దానికి ఫ్యాన్స్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. మున్నాభాయ్ చేరికతో కేజీఎఫ్ టీమ్ లో ఉత్సాహం రెట్టించిందని తెలుస్తోంది.

ఇటీవల సంజూ భాయ్ పై కీలక షెడ్యూల్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. అయితే ఉన్నట్టుండి ఈ సినిమా షూటింగ్ కి ఊహించని జోల్ట్ తగిలింది. కేజీఎఫ్ మైనింగ్ ని పర్యవేక్షించే.. జేఎంఎఫ్ సీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో షూటింగ్ ని ఆపేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ప్రస్తుతం కేజీఎఫ్ లోని సైనైడ్ హిల్స్ ఏరియాలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కానీ ఇక్కడ షూటింగ్ ని నిరాకరిస్తూ.. స్థానికుడు శ్రీనివాస కేజీఎఫ్ టీమ్ పై కేసు పెట్టారు. సైనైడ్ హిల్స్ ని నాశనం చేస్తూ సెట్స్ వేస్తే పర్యావరణ కాలుష్యం తలెత్తుతుందని అతడు వాదన వినిపించడంతో కోర్టు తీర్పు అతడికి అనుకూలంగా వెలువడింది. అయితే ఇటీవలే కీలక షెడ్యూల్ ని ప్రారంభించిన టీమ్ కి ఇది ఊహించని ఆటంకం అని తెలుస్తోంది. ఈ సినిమాని 2020 లో రిలీజ్ చేసేందుకు నిర్మాత విజయ్ కిరంగదుర్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer