హౌస్ ఫుల్ అవుతున్నా ఆన్ లైన్ దారుణం

0

ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత చాలా నెలలు లేదా సంవత్సరాలే పట్టేది. కాని ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ పెరగడం.. వాటి మద్య పోటీ పెరగడంతో సినిమాలను భారీ రేట్లకు శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసి విడుదలై కొన్ని నెలల్లోనే విడుదల చేయడం మొదలు పెట్టారు. కొన్ని సినిమాలను 50 రోజులు 100 రోజులు పూర్తి కాకుండానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ప్రేక్షకులు ఎలాగూ త్వరలో టీవీలో వస్తుంది కదా ఖర్చు పెట్టి చూడం ఎందుకు అంటూ థియేటర్లకు చాలా మంది వెళ్లడం తగ్గించారు.

ఒక వైపు టీవీలు థియేటర్లకు ప్రేక్షకులు రాకుండా చేస్తున్నాయని బాధపడుతున్న సమయంలోనే ఓటీటీ మొదలైంది. అమెజాన్ ప్రైమ్.. నెట్ ప్లిక్స్.. హాట్ స్టార్ ఇలా పలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లు సినిమాలను విడుదల చేస్తున్నాయి. భారీ మొత్తాలకు కొనుగోలు చేసి విడుదలైన నెల రోజుల్లోనే ఆన్ లైన్ లో ఉంచేస్తున్నాయి. నిర్మాతలు కాస్త ఎక్కువ డబ్బులకు ఆశపడి ఓటీటీకి అప్పగించేస్తున్నారు. దీంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య మరింత దారుణంగా తగ్గింది. ఒక వైపు సినిమాలు థియేటర్ లో ఉండగానే ఆన్ లైన్ లో వచ్చేస్తున్నాయి.

ఇటీవలే తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఖైదీ సినిమాను అప్పుడే హాట్ స్టార్ ఆన్ లైన్ లో ఉంచేసింది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈ సినిమ ఇంకా ఉంది. ముఖ్యంగా తమిళనాడులో పాతిక థియేటర్ల వరకు ప్రతి రోజు కూడా మంచి ఆక్యుపేషన్ ను దక్కించుకుంటున్నాయట. మొన్నటి వీకెండ్స్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయట. పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఖైదీకి ఇంకా మంచి షేర్ వస్తుంది. దాంతో బయ్యర్లు లాభాల బాట పట్టారు.

ఈమద్య కాలంలో బయ్యర్లకు లాభాలు తెచ్చి పెడుతున్న సినిమాలు చాలా తక్కువ. అలాంటిది ఖైదీ లాభాలు తెచ్చి పెడుతుంటే ఈలోపు ఆన్ లైన్ లో సినిమా వచ్చేసింది. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయ్యర్లు ఏమై పోయినా పర్వాలేదా.. సినిమా వసూళ్లు సాధిస్తున్న సమయంలో ఆన్ లైన్ లో ఉచితంగా చూసే వీలుంటే థియేటర్లకు ఎవరైనా వస్తారా అంటూ తమిళ డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బయ్యర్లు సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రారు.. మీరు డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదల చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Please Read Disclaimer