పారితోషికం భారీగా పెంచిందట!

0

కియరా అద్వాణీ.. బాలీవుడ్ లో ఏ నోట విన్నా ప్రస్తుతం ఈ పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్లు దీపిక.. అనుష్క శర్మ.. ప్రియాంక చోప్రా అంటూ ఏవో నాలుగైదు పేర్లు ప్రముఖంగా వినిపించేవి. అయితే ఆ జనరేషన్ అనూహ్యంగా పెళ్లి చేసుకుని కాస్త దూరం జరిగారు. సరిగ్గా ఇలాంటి లూప్ ఫేజ్ లో అడుగు పెట్టిన కియరా అద్వాణీ వస్తూనే బ్లాక్ బస్టర్లతో పైపైకి దూసుకెళ్లిపోతోంది. కెరీర్ ఆరంభమే ఈ అమ్మడికి కబీర్ సింగ్ రూపంలో జాక్ పాట్ తగిలింది. తెలుగు కుర్రాడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన కబీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి ఇంకా విజయవంతంగా రన్ అవుతోంది.

ఈ సినిమాతో అటు టైటిల్ పాత్ర పోషించిన షాహిద్ జాతకం మారిపోయింది. ఇటు కథానాయికగా నటించిన కియరా అద్వాణీకి కెరీర్ కీలక మలుపు తిరిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కియరా నటనకు విమర్శకుల ప్రశంసలు కురిసాయి. కంటెంట్ బోల్డ్ అని విమర్శించినా నటీనటులను మాత్రం విమర్శకులు పొగిడేశారు. ఇక మూవీ ఆద్యంతం లిప్ లాక్ లు.. ఇంటెన్స్ సీన్లతో కియరా పెర్ఫామెన్స్ కట్టి పడేసింది. నటిగా తానేంటో నిరూపించుకునేందుకు కియరాకి ఆస్కారం దొరికింది. బాలీవుడ్ అగ్ర దర్శకుల చూపు కియరా పైకి ప్రసరించేలా చేసింది కబీర్ సింగ్.

కారణం ఏదైనా కియరాకి ఇప్పటికిప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ వరుసగా రెండు సినిమాల్లో అవకాశాలిచ్చాడు. కబీర్ సింగ్ లో కియరా నటనకు మంత్ర ముగ్ధుడైపోయాడట కరణ్. అందుకే తనపై ప్రశంసలు కురిపిస్తూ అవకాశాలిచ్చాడు. కేవలం కరణ్ మాత్రమే కాదు.. అనూహ్యంగా వచ్చిన క్రేజుతో తన చుట్టూ నిరంతరం పలువురు అగ్ర దర్శకనిర్మాతలు అడ్వాన్సులతో కంచె వేస్తున్నారట. కాంపిటీషన్ చూసి కియరా కూడా పారితోషికాన్ని భారీగా పెంచేసిందని చెబుతున్నారు. ఇక కియరా తెలుగులో నటించాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు అనేంతగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు వెంటపడుతున్నారట. ఇదంతా సందీప్ రెడ్డి వంగా వల్లనే!!
Please Read Disclaimer