మహేశ్ కు సర్జరీ జరిగిందా? ఇప్పుడెక్కడ?

0

తెర మీద వీరవిహారం చేసే హీరో.. తెర వెనుక మనలాంటి మనిషే. మనకు మాదిరే సదరు హీరో గుండె..కిడ్నీ.. కాలేయం పని చేస్తుంటాయి. ఆరోగ్యంగా ఉండే సగటు మనిషి శక్తి సామర్థ్యాలు ఎంతో.. రీల్ సూపర్ హీరోలూ అలానే ఉంటారే తప్పించి అందుకు అతీతంగా ఉండరన్న సత్యాన్ని మర్చిపోకూడదు. తాజాగా మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ లో ఉన్నట్లు గా వార్తలు వస్తున్నాయి.

నిజంగానే మహేశ్ మోకాలికి సర్జరీ జరిగిందా? అంటే అవుననే వారు ఎంత మందో కాదనే వారు అంతే మంది కనిపిస్తారు. ఈ నేపథ్యంలో తుపాకీ తనకున్న సోర్సులతో పెద్ద ఎత్తున మాట్లాడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేశ్ మోకాలికి సర్జరీ జరిగిందని తేలింది. అధికారికంగా దీనికి సంబందించిన రిపోర్టుల్ని చూపించలేం కానీ.. మహేశ్ కు అత్యంత సన్నిహితులు మాత్రం సర్జరీ మాట వాస్తవమే అని చెబుతున్నారు.

ఆగడు షూటింగ్ సమయంలో తగిలిన గాయం తిరగబెట్టటం.. దానికి సర్జరీ అవసరం కావటంతో తాజాగా చేయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం భార్య.. పిల్లలతో ఫారిన్ ట్రిప్ లో ఉన్న ఆయన మరో మూడు నెలల వరకూ షూటింగ్ వైపు వెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. సర్జరీ జరగ లేదని.. కేవలం హాలీడే మోడ్ లో మహేశ్ ఉండనున్నారన్న మాటపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హాలీడే మోడ్ అంటే ఒక నెల ఓకే. కానీ.. మూడు నెలల అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వరుస సినిమాలు ఉన్నప్పుడు మూడు నెలల టైం రెస్టు కోసం తీసుకోవటం అంటే.. కచ్ఛితంగా సర్జరీ జరిగిందంటున్నారు. సర్జరీ నేపథ్యంలో రెస్టు తీసుకోవటం కోసమే మూడు నెలలు ఖాళీగా ఉండనున్నట్లు చెబుతున్నారు. మరి.. సర్జరీ జరిగిందన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేయొచ్చుగా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తే ఆసక్తికర వాదనను వినిపిస్తున్నారు.

చాలామంది హీరోలకు బట్ట తల ఉంటుంది. కానీ.. ఎంతమంది తమకున్న రియల్ బట్ట తలను బయట ప్రపంచానికి చూపిస్తున్నారు. రీల్ హీరోలుగా తమకున్న సూపర్ మ్యాన్ ఇమేజ్ ను ఇసుమంత తగ్గించి చూపించుకోవటానికి ఇష్టపడరని.. ఆ లాజిక్కే తాజా సర్జరీ ఎపిసోడ్ లోనూ అప్లై అవుతుందని చెబుతున్నారు. మరి.. సర్జరీ పై జరుగుతున్న చర్చ పై మహేశ్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.