ఏపీలో 500కోట్లతో స్టూడియో.. ఇన్వెస్టర్ ఎవరు?

0

ఏపీ-తెలంగాణ విభజన తర్వాత టాలీవుడ్ ఆంధ్ర ప్రదేశ్ కి వెళుతుందని అన్నారు. కానీ ఏదీ లేదు. తెలంగాణ ప్రభుత్వ సానుకూల ధృక్పథమో లేక రెండు రాష్ట్రాల్లో ఫిలిం బిజినెస్ ఆటంకం లేకుండా కావాలనుకోవడమో మొత్తానికి కారణం ఏదైనా పరిశ్రమను ఎవరూ ఎటూ కదల్చలేకపోయారు. ఇక ఏపీ గత ప్రభుత్వంలోనూ కొత్త టాలీవుడ్ విషయమై చలనం లేకపోవడం.. చిత్తశుద్ధి లోపించడం వగైరా కారణాలతో ఎవరూ ఆ మాటే ఎత్తలేదు. పరిశ్రమ పెద్దలైతే ఇది అయ్యే పని కాదు! అంటూ ఛీదరించుకుని సైలెంట్ అయిపోయారు.

అయితే ఇండస్ట్రీ అగ్రనిర్మాతలు- స్టూడియో ఓనర్లు కం ఎగ్జిబిటర్లుగా ఏల్తున్న ఆ నలుగురు కానీ లేదా ఆ పది మంది కానీ ఏపీకి పరిశ్రమ తరలింపు విషయమై పల్లెత్తు మాట కూడా అనడం లేదు. కనీసం అక్కడో స్టూడియో కడతామని కానీ లేదా ఇంకేదైనా ప్రయత్నం చేస్తామని కానీ మాట వరుసకు కూడా అనకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇన్ని సర్ ప్రైజ్ ల మధ్య మరో ఆశ్చర్యకరమైన ప్రకటన వినగానే తెలుగు జనాలకు సడెన్ షాక్ తగిలింది.

ఆ వార్త సారాంశం ఏమిటంటే.. ఏపీలో రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో గుంటూరు పరిసరాల్లోని సూర్యలంకలో రూ.500 కోట్లతో సినిమా స్టూడియో- థీమ్ వాటర్ పార్క్ ఏర్పాటు చేస్తామని టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ప్రకటించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన బుధవారం నాడు ఈ ప్రకటన చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే రూ.500కోట్లు అంటే మాటలా? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే దానికి సరైన కారణమే చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కోన పెట్టుబడి పెడతాడా లేదా? అన్నది అటుంచితే.. ఒక అంతర్జాతీయ సంస్థతో మంతనాలు సాగిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖతో ఆ అంతర్జాతీయ సంస్థను కలిపి ఈ డీల్ సెట్ చేయాలన్నది ఆయన ప్లాన్. లోకల్ అధికారుల అనుమతితో సూర్యలంక పరిసరాల్లో సర్వే చేయిస్తామని అన్నారు. అమెరికాలోని డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ తరహాలో దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ తెలుగు సినీపరిశ్రమ నుంచి ఎవరైనా ఒక ప్రముఖుడు ఇలాంటి ప్రయత్నం చేసిందే లేదు. కోన చేస్తున్న ప్రయత్నం సక్సెసైతే మంచిదే. ఆయన్ని దేవుడిగా భావించి ఆ స్టూడియో- థీమ్ పార్క్ పూజా కార్యక్రమాల్లో కోటి కొబ్బరి కాయలు కొట్టొచ్చు!
Please Read Disclaimer