నన్ను కాస్త పట్టించుకోండయ్యా

0

టాలీవుడ్ లో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. అయితే విలక్షణ నటులు కొందరే ఉన్నారు. వారిలో కోట ముఖ్యుడిగా చెప్పుకోవచ్చు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న కోట శ్రీనివాస రావు సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. దాదాపు 750 సినిమాలను చేసిన కోట శ్రీనివాస రావు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గతంతో పోల్చితే అవకాశాలు చాలా తగ్గాయి. దాంతో సమయం వచ్చినప్పుడల్లా తనకు అవకాశాలు ఇవ్వాలంటూ దర్శకులను కోరడంతో పాటు.. దర్శకులపై విమర్శలు చేస్తున్నాడు.

కోట తన పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగిగా ఉన్న సమయంలో సినిమాలపై ఆసక్తితో ప్రయత్నించాను. కెరీర్ ఆరంభంలో ఉద్యోగం చేస్తూనే సినిమాలు చేశాను. అయితే ఎక్కువ ఆఫర్లు వస్తుండటంతో ఉద్యోగంకు స్వస్థి పలికి పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యాను. నా కెరీర్ లో ఎంతో మంది స్టార్స్ తో నటించాను.. ఎన్నో సూపర్ హిట్స్ లో ముఖ్య పాత్రలు పోషించాను కాని ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉన్నా కూడా దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదని కోట ఆవేదన వ్యక్తం చేశారు.

నాకు వయసు మీద పడిందని ఇప్పటి దర్శకులు నన్ను ఇంటికే పరిమితం చేశారు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. నన్ను కాస్త పట్టించుకోండయ్యా నేను నటించేందుకు ఇంకా ఆసక్తిగానే ఉన్నాను. ఒకప్పుడు రోజుకు 20 గంటలు పని చేసిన వాడిని ఇంట్లో ఊరికే కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది. పారితోషికం ఇవ్వకున్నా నాకు ఆఫర్లు ఇవ్వండి అంటూ దర్శకులను ఉద్దేశించి కోట వ్యాఖ్యలు చేశారు. కోటతో పాటు ఇంకా పలువురు సీనియర్ లు కూడా అవకాశాలు లేక దర్శకుల వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మన దర్శకులు వేరే భాషకు చెందిన వారిని తీసుకు వస్తున్నారంటూ గతంలో కోట విమర్శలు చేశారు. తెలుగు నటీనటులకు నెలలో కనీసం 12 రోజులు అయినా పని దినాలు కలిపించాల్సిన బాధ్యత మాపై ఉందని కోట గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
Please Read Disclaimer