కౌశల్య కృష్ణమూర్తి ట్రైలర్: కౌశల్య క్రికెట్ కష్టాలు

0

ఐశ్వర్య రాజేష్ నటించిన తాజా చిత్రం `కౌశల్య కృష్ణమూర్తి`. రాజేంద్రప్రసాద్- శివకార్తికేయన్ ప్రధాన పాత్రధారులు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన `కణ` చిత్రానికి అధికారిక రీమేక్ ఇది. పల్లెటూరు.. వ్యవసాయ కుటుంబం.. రైతుల కష్టాలకు ముడి వేస్తూ.. క్రికెటర్ కావాలనుకునే పేదింటి యువతి కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది.

ఇదివరకూ రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ట్రైలర్ విడుదలైంది. క్రికెటర్ కావాలనుకునే యువతిగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. క్రికెట్ నేపథ్యంలో ఆద్యంతం ఐశ్వర్యపై చూపించిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. `నీ వల్ల కాదంటే నీవు నమ్మాల్సింది వాళ్లను కాదు.. నిన్ను`.. `ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాళ్ల మాట మాత్రమే వింటుంది… నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు` లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇండియా ఓటమి చూసిన నాన్న కంట కన్నీటి బొట్టు చూడలేక క్రికెటర్ అయిన చిన్నారి పెద్దయ్యాక జాతీయ స్థాయి క్రికెట్ ఆడాలనుకుంటే పేదరికం వెనకబాటుతనంతో ఎదురయ్యే పాట్లు ఏమిటి? అన్నది తెరపై ఆవిష్కరిస్తున్నారు. పల్లెటూరి పిల్ల అంటే ఏటికి ఎదురీతే అన్న సన్నివేశాల్ని ట్రైలర్ లో ఎలివేట్ చేశారు.

ఇప్పటికే `కౌశల్య కృష్ణమూర్తి` సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం `యు` సర్టిఫికెట్ జారీ అయింది. ఆగస్టు 23న సినిమా విడుదలవుతోంది. `ఒక కలల ప్రయాణం ప్రారంభమైంది` అంటూ ట్రైలర్ తో ప్రచారంలో వేగం పెంచింది టీమ్. క్రికెట్ నేపథ్యంలో సినిమాల వెల్లువ కొనసాగుతోంది. ఈ కేటగిరీలోనే వస్తున్న `కౌశల్య కృష్ణమూర్తి` ఏ మేరకు మెప్పించనుందో చూడాలి.
Please Read Disclaimer