కమర్షియల్ రైటర్స్ సపోర్ట్ కోరిన క్రియేటివ్ డైరెక్టర్

0

క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు కృష్ణ వంశీ ఈమద్య కాలంలో తన సినిమాల సంఖ్యను చాలా తగ్గించాడు. 2014లో చరణ్ తో ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం చేసిన తర్వాత 2017లో నక్షత్రం అనే చిత్రాన్ని చేశాడు. ఈ అయిదు సంవత్సరాల్లో కృష్ణవంశీ నుండి వచ్చినవి రెండే సినిమాలు. ఈయన సినిమాల గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అదుగో ఇదుగో అంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు కృష్ణవంశీ ‘రంగ మార్తాండ’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా అఫిషియల్ గా ప్రకటించాడు.

మరాఠి హిట్ మూవీ ‘నటసామ్రాట్’ ను తెలుగులో ‘రంగ మార్తాండ’గా రీమేక్ చేయబోతున్నాడు. సినిమా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణలు ఈ చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో కమర్షియల్ సినిమాల రచయితలుగా మంచి గుర్తింపు దక్కించుకున్న పరుచూరి బ్రదర్స్ వద్దకు రంగమార్తాండ స్క్రిప్ట్ ను కృష్ణవంశీ తీసుకు వెళ్లాడట.

నటసామ్రాట్ చిత్రాన్ని పూర్తిగా తెలుగు నేటివిటీకి మార్చడంతో పాటు ఆ ఫీల్ ను పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. పరుచూరి బ్రదర్స్ ఈ స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడంతో పాటు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇటీవల వచ్చిన సైరా చిత్రంకు కూడా పరుచూరి బ్రదర్స్ తమ కలంను అందించిన విషయం తెల్సిందే. ఇంకా పలువురు రచయితలు మరియు దర్శకులు కూడా పరుచూరి బ్రదర్స్ సీనియర్స్ కనుక వారి సలహాలు సూచనలు అడుగుతూ ఉంటారు. ఈసారి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా తన ‘రంగమార్తాండ’ సినిమా కోసం వారి సూచనలు తీసుకున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని కృష్ణవంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు.