మీడియా చానెళ్లపై సీనియర్ నిర్మాత ఫైర్

0

కమర్షియాలిటీతో పాటు అభిరుచి ఉన్న గొప్ప సినిమాలు తీసే సీనియర్ నిర్మాతగా కె.ఎస్.రామారావుకి ప్రత్యేకించి పరిశ్రమలో గౌరవం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఎన్నో క్లాసిక్స్ ని నిర్మించిన ఆయనను మెగా నిర్మాత అని గౌరవించుకుంటారు. అయితే అలాంటి పెద్దాయన నేడు మీడియాపై నిర్వేదం వ్యక్తం చేస్తూ ఓ రెండు ప్రధాన టీవీ చానెళ్ల నిర్వాకంపై ఫైర్ అయిన తీరు పరిశ్రమలో ప్రముఖంగా చర్చకు వచ్చింది.

ఆ రెండు టీవీ చానెళ్లు కావాలనే తమ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని కవర్ చేయలేదని నిర్మాత కె.ఎస్.రామారావు ఆరోపించారు. నేను నిర్మించిన `కౌశల్య కృష్ణమూర్తి` సినిమా కాదా. చిన్న సినిమాలు సినిమాలు కావా? అయినా వాణిజ్య ప్రకటనలు తీసుకుని మరీ ఇలా చేస్తారా? అంటూ ఆయన ఫైరవ్వడంతో మీడియా అవాక్కయ్యింది. హైదరాబాద్ లో జరిగిన `కౌశల్య కృష్ణమూర్తి` ప్రీరిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండ- రాశీ ఖన్నా లాంటి క్రేజీ స్టార్లు విచ్చేశారు. అయినా లైవ్ కవరేజీ ఇవ్వని ఆ రెండు చానెళ్ల వైఖరిని ఆయన తూర్పారబట్టిన వైనం టాలీవుడ్ మీడియాలో దఫదఫాలుగా చర్చకు వచ్చింది.

“మా సినిమా అసలు సినిమానే కాదా? నేను నిర్మాతనే కాదా? ప్రతి సినిమాకి లైవ్ కవరేజీ ఇస్తున్నారు. నేను తీసిన సినిమానే ఎందుకు కవర్ చేయలేదు? మేం కూడా ప్రకటనలు ఇస్తున్నాం కదా? అంటూ తనదైన శైలిలో సదరు టీవీ చానెళ్లపై విరుచుకుపడ్డారు. మీడియాలో ఈ వైఖరి మారాలి. కొందరికే జోల పడే ఈ విధానం మారాలి. చిన్న సినిమాకి మీడియా అండదండలు అవసరం. కేవలం బిజినెస్ అన్న కోణం మాత్రమే చూడకూడదు! అని ఫుల్ గా క్లాస్ తీస్కున్నారు. కేవలం బిజినెస్ నే చూడకుండా సినిమా పురోభివృద్ధిని మీడియా మ్యానేజ్ మెంట్లు చూడాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు. అయితే అగ్ర మీడియాలం అని చెప్పుకునే ఆ రెండు చానెళ్లను ఇన్నేళ్లలో ఇలా ప్రశ్నించిన డేరింగ్ ప్రొడ్యూసర్ లేనేలేరు. ఆ రెండు చానెళ్ల సపోర్టు తమకు తప్పనిసరిగా కావాలని భావించేవాళ్లెవరూ నోరెత్తరు. కానీ నేడు సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ఎంతో ధైర్యం చేసి సదరు చానెళ్ల ఒంటెద్దు పోకడపై ఇలా తుపాకి గుళ్లు పేల్చడం పదే పదే ప్రముఖంగా చర్చకు వచ్చింది.
Please Read Disclaimer