కురుక్షేత్రం – ట్రైలర్ టాక్

0

ఇండియా మొదటి త్రీడి మైథలాజికల్ మూవీగా చెప్పబడుతున్న కురుక్షేత్రం ట్రైలర్ రిలీజయ్యింది. కన్నడలో కురుక్షేత్ర పేరుతో మునిరత్న నిర్మించిన చిత్రానికి ఇది తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఇక విషయానికి వస్తే ఇది తరతరాలుగా ప్రతి భారతీయుడికి తెలిసిన గాథే చూసిన కథే. కొత్తేమి కాదు. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో రూపొందించిన దానవీర శూరకర్ణకు ఈ కురుక్షేత్రంకు చాలా పోలికలు కనిపిస్తాయి.

జూదంలో ధర్మరాజు పందెం ఓడటం – ద్రౌపది వస్త్రాపహరణం – కర్ణుడి వీరోచితం – అభిమన్యుడి పద్మవ్యూహ సాహసం వెరసి ఇప్పటికే ఎన్నో వందల సినిమాల్లో చూసిన ఘట్టాలు ఇందులోనూ ఉన్నాయి. కాకపోతే వాటికి దీనికి తేడా విజువల్ ఎఫెక్ట్స్. భారీ వ్యయంతో రూపొందిన ఈ మల్టీ స్టారర్ లో గ్రాఫిక్స్ కు పెద్ద పీఠ వేశారు. బాగున్నాయి కానీ మరీ కళ్లుచెదిరే స్థాయిలో లేకపోవడం కొంత నిరాశ పరుస్తుంది. ట్రైలర్ ఎడిటింగ్ కూడా కాస్త హడావిడిగా చుట్టేసినట్టు అనిపించడంతో ఫీల్ మిస్ అయ్యింది

తెలుగుకు సంబంధించి మరో ముఖ్యమైన బ్యాక్ డ్రాప్ కీలక ఆర్టిస్టులు మనకు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కావడం. మెయిన్ అట్రాక్షన్ గా చెప్పబడుతున్న దర్శన్ ను మన వాళ్ళు చూసిందే తక్కువ. ధర్మరాజుగా శశికుమార్ భీష్మగా స్వర్గీయ అంబరీష్ వీళ్లంతా మన నేటివిటీకి కనెక్ట్ కాలేని వాళ్ళే. కర్ణుడు పాత్రలో అర్జున్ శకునిగా రవి శంకర్ అర్జునుడిగా సోను సూద్ ద్రౌపదిగా స్నేహ తెలిసున్న ఆర్టిస్టులు కావడం కొంత ఊరట. కృష్ణుడిగా రవిచంద్రన్ అంతగా నప్పలేదు

హరికృష్ణ సంగీతంలో సౌండ్ ఎక్కువైంది. నాగన్న దర్శకత్వంలోనూ మరీ మెరుపులు కనిపించలేదు. మొత్తానికి ఊరు గొప్ప సామెత చెప్పినట్టు ఖర్చు అయితే పెట్టారు కానీ దానికి తగ్గ అవుట్ ఫుట్ మాత్రం కురుక్షేత్రంలో కనిపించలేదు. మరి సినిమాలో ఏమైనా మరిపించారేమో తెలియాలంటే ఈ సినిమా విడుదల కానున్న ఆగస్ట్ 2 దాకా ఆగాల్సిందే
Please Read Disclaimer