మహరాష్ట్ర లో సంచలనం సృష్టిస్తున్న లతా భగవాన్ కరె

0

ఒక సినిమా తీయడానికి ఏం కావాలి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ‘ఒక మంచి కథ’. కానీ కమర్షియాలిటీ.. బిజినెస్ లెక్కలు.. ఇలాంటివి అన్నీ చూసుకున్నప్పుడు వాటిని సినిమా లో బలవంతంగా చొప్పించినప్పుడు కథ అనేది వెనక్కు పోతుంది.. ఈ ఫార్మాట్ చట్రంలో పడి కథ గొంతుక ఆటోమేటిక్ గా నలిగిపోతుంది.. ఊపిరి ఆడదు. అందుకే మన సినిమాల్లో కథ అనేది ఎప్పుడూ కొన ఊపిరితో బతుకీడుస్తూ ఉంటుంది.. ప్రతి ఒక్క దర్శకుడికి ఎదురయ్యే సమస్యే ఇది. అయితే కొందరు దర్శకులు మాత్రం కథకే పెద్ద పీట వేస్తారు. ఆ కథ కోసం కమర్షియల్ బంధానాలను సవాలు చేస్తారు.. అలాంటి ఒక దర్శకుడు కథకు పెద్ద పీట వేసి రూపొందించిన సినిమానే ‘లతా భగవాన్ కరె’.

ఇది ఈమధ్యే మహారాష్ట్ర లో విడుదలైన మరాఠి చిత్రం. ప్రేక్షకాదరణ తో పాటుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సినిమా. ఈ సినిమా లతా భగవాన్ కరె అనే ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించించారు. సినిమా కథ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే 65 ఏళ్ల పేద మహిళ. కూలి పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో భర్తకు అనారోగ్యం. ఆపరేషన్ చెయ్యాలంటారు. చేతిలో డబ్బు ఉండదు. ఇచ్చేవారు ఎవరూ ఉండరు. ఈ సమయంలో మారథాన్( 42.2 km పరుగు పందెం) పోటీ గురించి వింటుంది. అందులో గెలిస్తే డబ్బు చేతికొస్తుందని ఆశపడుతుంది. ఎలాగైనా అందులో గెలిచి భర్త ప్రాణం నిలబెట్టుకోవాలని తన మనసులో ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటుంది. కానీ కుటుంబం.. పిల్లలు ఒప్పుకోరు.. వయసు సహకరించదు. అయినా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఆ మారథాన్ లో విజయం సాధిస్తుంది. ఒక ఏడాది కాదు. వరసగా మూడు సంవత్సరాలు. తన భర్త ప్రాణం కాపాడుకుంటుంది.

ఈ నిజ జీవిత కథను రియల్ లోకేషన్లలో చిత్రీకరించారు. నియో రియలిస్టిక్ ఫిలిం లాంటిది. ఎవరి జీవిత కథను ఈ సినిమాకు తీసుకున్నారో ఆవిడే ఈ సినిమాలో హీరోయిన్.. లతా భగవాన్ కరె. ఇప్పుడు ఆవిడ వయసు 69 సంవత్సరాలు. ఈ సినిమా మహారాష్ట్ర లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది నేషనల్ అవార్డు నామినేషన్స్ లో ఈ సినిమా తప్పని సరిగా ఉంటుందని ఇప్పటికే విమర్శకులు కితాబిస్తున్నారు.

లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్.. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు మన తెలుగువాడు.. తెలంగాణా పోరడు.. నవీన్ దేశబోయిన. ఇక ఈ సినిమా ను నిర్మించిన వ్యక్తి కూడా సేమ్ టు సేమ్.. ఆరబోతు కృష్ణ. మనమందరం తప్పని సరిగా వీరిని అభినందించాల్సిందే.
Please Read Disclaimer