‘చంద్రముఖి 2’ పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు : లారెన్స్

0

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘చంద్రముఖి’ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. హారర్ జోనర్ లో రజినీకాంత్ తొలిసారిగా నటించిన ఈ సినిమాకి పి.వాసు దర్శకత్వం వహించారు. కన్నడ భాషలో సూపర్ హిట్ అయిన ‘ఆప్తమిత్ర’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో జ్యోతిక – నయనతార – ప్రభు – మాళవిక – వినీత్ – సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక దర్శకుడు వాసు చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సీక్వెల్ గా ‘చంద్రముఖి 2’ ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవల రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ కాంబినేషన్ లో రాబోయే ”చంద్రముఖి 2” సినిమాలో నటిస్తున్నానంటూ వెల్లడించారు. ఈ సీక్వెల్ కి కూడా పి.వాసు దర్శకత్వం వహిస్తారని.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కాలానిథి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా ‘చంద్రముఖి 2’లో నటించబోయే హీరోయిన్స్ విషయంలో రోజుకొక వార్త వస్తూనే ఉంది. ముందుగా ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ లీడ్ రోల్ ప్లే చేయబోతోందని న్యూస్ వచ్చింది. అయితే దీనిపై సిమ్రాన్ స్పందిస్తూ అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ‘చంద్రముఖి’లో నటించిన జ్యోతిక ఈ సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుందని చెప్పుకున్నారు. ఈ మధ్య ‘భరత్ అనే నేను’ హీరోయిన్ కియారా అద్వానీని ఫైనలైజ్ చేశారంటూ మరో న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ ట్విట్టర్ వేదికగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ”మీడియాలో చంద్రముఖి 2 ఫిమేల్ లీడ్ విషయంలో చాలా రూమర్స్ వస్తున్నాయి. సిమ్రాన్ అని జ్యోతిక అని కియారా అద్వానీ అని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఫిమేల్ లీడ్ ని కంఫర్మ్ చేసి అధికారికంగా మేకర్స్ ప్రకటిస్తారు” అని పోస్ట్ చేసారు. దీంతో ఇప్పటి వరకు ‘చంద్రముఖి 2’ పై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని క్లారిటీ వచ్చేసింది.