మీటింగులు పెట్టుకుని ఛాన్సులిస్తారా?

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో సభ్యులు అయినంత మాత్రాన ఆర్టిస్టుకు ఛాన్స్ ఇవ్వాలని రూల్ ఉందా? అంటే లేనేలేదనేది క్రియేటివ్ ప్రొఫెషన్ రూల్. క్రియేటివిటీ ప్రపంచంలో రుద్దుడుకు ఆస్కారం లేదు. ఎంచుకున్న కథకు ఏ ఆర్టిస్టు సూటయితే ఆ ఆర్టిస్టుకే అవకాశం దక్కుతుంది. అయితే ఎంపిక చేసుకునే క్రమంలో మా అసోసియేషన్ కి చెందిన ఫలానా ఆర్టిస్టు సరిపోతారు.. ఈ కథలో ఈ పాత్రకు వీళ్ల నుంచి ఒకరిని ఎంచుకుంటే సూటవుతారు అన్నది దర్శకనిర్మాతలు- కాస్టింగ్ సెలక్షన్ చేసేవాళ్లు చూడాల్సి ఉంటుంది. అయితే కనీసం అది కూడా చేయడం లేదనేది మూవీ ఆర్టిస్టుల సంఘం ఆరోపణ.

ఏదైనా సినిమా ప్రారంభానికి ముందు విధిగా మూవీ ఆర్టిస్టుల సంఘం నుంచి ప్రొఫైల్స్ పరిశీలించాలనే ప్రతిపాదనను తెచ్చింది మా అసోసియేషన్. సంఘంలో ఆర్టిస్టులకు అవకాశాలు పెరిగేలా చేస్తామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నరేష్ సహా జీవిత – రాజశేఖర్- సురేష్ కొండేటి బృందం హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఆర్టిస్టులకు అవకాశాలిచ్చే కీలకమైన నాలుగు సంఘాల ప్రతినిధుల్ని కలిసి వినతి పత్రాల్ని అందించారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ సుప్రియ- తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్ – తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ – తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణ లను కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే వీళ్లంతా విధిగా `మా` అసోసియేషన్ విన్నపాన్ని పరిశీలించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

విన్నపంలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వేషాలు లేక ఇబ్బందులు పడుతున్న మా ఆర్టిస్టులను ఆదుకోవాల్సిందిగా.. ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులకు ఛాన్సులివ్వాల్సిందిగా `మా` ప్రతినిధులు అభ్యర్థిస్తుండడం ఆసక్తికరం. అలాగే ఆర్టిస్టుల ప్రొఫైల్స్- పోన్ నంబర్లు- ఫోటోలు- వీడియోలతో ప్రత్యేకించి ఒక వెబ్ సైట్ కి రూపకల్పన చేస్తామని ఈ సందర్భంగా మా అసోసియేషన్ ప్రకటించడం ఆసక్తికరం. ఆ నాలుగు శాఖల ప్రతినిధులు మీటింగులు పెట్టుకుని మా ఆర్టిస్టులకు ఎలా అవకాశాలివ్వాలో ఓ నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారట. మరి ఈ చర్చలు – మీటింగులు ఎంతవరకూ ఫలిస్తాయి? అన్నది వేచి చూడాల్సిందే. ఒకవేళ `మూవీ ఆర్టిస్టుల సంఘం` నుంచే ఆర్టిస్టుల్ని ఎంచుకోకపోతే సన్నివేశమేంటి? క్రియేటివ్ ఫీల్డ్ లో అది కుదరని పని అయితే ఏంటి సీను? వీళ్లందరినీ ఉత్సవ విగ్రహాల కిందే పరిగణించాల్సి ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ `మా` ప్రతినిధులే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
Please Read Disclaimer