స్టార్ల సినిమాలకే దిక్కు లేదు.. అక్కడ మాత్రమే రిలీజా??

0

తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ తీవ్రంగా దెబ్బ తిన్నది అనేది నిర్వివాదాంశం. కారణాలు చర్చించడం అప్రస్తుతం. స్టార్ హీరోల క్రేజీ సినిమాలు అక్కడ చతికిల పడుతున్నాయి. కొందరు స్టార్ హీరోల సినిమాలు కొనే నాథుడు లేకపోవడంతో హీరోలు ఓన్ రిలీజ్ కు పోతున్నారు. ఓవర్సీస్ రిలీజ్ లేకపోతే పరువు పోతుందనే ఆలోచనతో స్వయంగా రిలీజ్ చేయడమో లేదా తెలిసిన వారి చేతిలో పెట్టడమో చేస్తున్నారు. పైకి మాత్రం అంతకు అమ్ముడుపోయింది.. ఇంతకు అమ్ముడుపోయింది అని చెప్పుకుంటున్నారు. ఇలా రిలీజ్ చేసినప్పుడు.. వారి సినిమా హిట్ అయితేనే కనీసం ఒక్క డాలర్ అయినా వస్తుంది లేకపోతే కలెక్షన్స్ గుండుసున్నా. చేతి చమురు వదలకపోతే అదే పదివేలు!

స్టార్ హీరోల పరిస్థితే ఇలా ఉంటే కొత్త సినిమాలను.. స్టార్ కాస్ట్ లేని సినిమాలను.. చిన్న సినిమాలను ఓవర్సీస్ లో ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? తాజాగా ‘మథనం’ అనే సినిమాను అమెరికాలో మాత్రమే విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చెయ్యడం లేదు. ఇది నిజంగా ఆసక్తికరంగా అనిపించే వార్తే కదా? మరి ఈ సినిమాను అమెరికాలో మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే ఫిలిం మేకర్లకు వారి లెక్కలేవో వారికి ఉంటాయి. అయితే అసలు మార్కెట్ అయిన తెలుగు రాష్ట్రాలను వదిలేసి కొసరు మార్కెట్ అయిన అమెరికాపై మాత్రమే దృష్టి సారించడం మాత్రం వింతే.

ఇలా చేస్తే అసలు సినిమాపై పెట్టిన ఖర్చు వెనక్కు వస్తుందా? పోస్టర్ ఖర్చులైనా వస్తాయా? ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు.. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరనేది ప్రేక్షకులకు తెలియదు. ప్రమోషన్స్ భారీగా చేస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు రాని రోజులివి. ఇలాంటి సమయంలో ఇలా ప్రేక్షకులు పట్టించుకోని చోట రిలీజ్ అంటే ఈ సినిమాను సరదా కోసం తీసినట్టున్నారు కానీ హిట్ చేసే ఉద్దేశంతో తీసినట్టు లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి అమెరికా ప్రేక్షకులు ఎంత సహృదయంతో ఈ సినిమాను ఆదరిస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer