రెమ్యునరేషన్ ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటుందట!

0

ఆత్మహత్యాయత్నం ఏమైనా పిల్లాట? కష్టం ఉంటే ఎదుర్కోవాలి. పోరాడాలి. ఫలితం కోసం ప్రయత్నించాలి. అన్యాయం జరిగితే దానికి వ్యతిరేకంగా గళం విప్పాలి. కుదిరితే ఒంటరిపోరు చేయాలి.. లేదంటే తన మాదిరి నష్టపోయిన వారందరిని జమ చేసి అన్యాయానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. అంతేకానీ.. నా డిమాండ్ ఇది. చాలా న్యాయమైనది. నేను కోరుకున్నట్లు చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉంటుంది?

తాజాగా అలాంటి పనే చేసిన ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి వచ్చింది తమిళ హాస్యనటి మధుమిత. బిగ్ బాస్ తమిళ వెర్షన్ లో ఇటీవల హౌస్ లో ఆత్మహత్యాయత్నం చేసి.. బిగ్ బాస్ ఆగ్రహానికి లోనై.. ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఆమె.. తాజాగా మరోసారి సూసైడ్ వార్నింగ్ ఇచ్చారన్న ఆరోపణ కలకలం రేపుతోంది.

షోలో పాల్గొన్నందుకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని తనకు ఇచ్చేయాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా పేర్కొంటూ విజయ్ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండి పోలీసులకు కంప్లైంట్ చేశారు. పారితోషికంపై మధుమిత సూసైడ్ వార్నింగ్ ఇచ్చారా? అన్న అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు. తాను పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. ఇప్పటివరకూ తాను ఎవరి మీదా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పింది.తనపై కూడా ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదంది.

తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని విజయ్ టీవీ నిర్వాహకుల్ని అడిగానని.. వారు ఇస్తామని చెప్పారని.. అంతలోనే తన మీద ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారో తనకు అర్థం కావట్లేదంది. తన పారితోషికం గురించి అడిగినంతనే బిల్లు పంపమన్నారని.. తాను పంపానని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని..కానీ తన మీద పోలీస్ స్టేషన్లో బెదిరింపు ఫిర్యాదు ఎందుకు చేశారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు.

తాను విజయ్ టీవీ వారికి ఫోన్ చేస్తే.. వారు స్పందించలేదన్నారు. ఈ అంశంపై నటుడు కమల్ హాసన్ రియాక్ట్ కావాలని.. ఈ అంశంపై ఆయన సరైన పరిష్కారం చూపాలని కోరుతోంది మధుమిత. తాను షో నుంచి బయటకు రావటానికి కారణమైన ఫుటేజ్ ను ప్రసారం చేయకపోవటం బాధాకరమని పేర్కొంది. తాను చానల్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏమీ మాట్లాడలేకపోతున్నట్లు చెప్పిన మధుమిత మాటలు వింటే.. షో నుంచి సూసైడ్ అటెంప్ట్ కారణంగా బయటకు వచ్చిన దాని వెనుక ఇంకేదో విషయం ఉందన్న అనుమానం కలుగక మానదు. మరి.. ఈ విషయాన్ని రివీల్ చేసేదెవరు? ఇంతకీ పారితోషికం కోసం మధుమిత ఏం చేశారన్న దానిపై ఎవరు క్లారిటీ ఇస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Please Read Disclaimer