నడిగర సంఘం ఆక్రమించుకోలేదు

0

దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) సొంత భవంతి నిర్మాణం అన్నివేళలా హాట్ టాపిక్. ఈ సంఘానికి కార్యదర్శిగా ఉన్న విశాల్ ఎట్టి పరిస్థితిలో భవంతిని నిర్మించి తీరతానని సవాల్ చేయడంతో అది కాస్తా ప్రముఖంగా చర్చకు వచ్చింది. అయితే రకరకాల రాజకీయ కారణాలతో విశాల్ కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నా.. సంఘం అధ్యక్షుడు నాజర్ సారథ్యంలో ఈ భవంతి నిర్మాణం పూర్తవుతోంది. అయితే ఈ సంఘం భవంతి నిర్మిస్తున్న చోట 33 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఒక రోడ్డును అక్రమంగా ఆక్రమించుకున్నారని టీ.నగర్ విద్యోదయ కాలనీకి చెందిన శ్రీరంగం-అన్నామలై అనే వ్యక్తులు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రస్తుతం దానిపై విచారణ సాగుతోంది. తాజాగా ఈ కేసు విషయమై నడిగర సంఘానికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువడడంపై ఆర్టిస్టుల్లో హర్షం వ్యక్తమవుతోంది. టీ.నగర్ అబిబుల్లా రోడ్డులో నడిగర్ సంఘం కార్యాలయం ఉండగా.. దానిని కూల్చేసి అక్కడ భారీ భవంతిని నిర్మిస్తున్నారు. ఇక్కడే రోడ్డును ఆక్రమించుకున్నారన్నది ఆరోపణ.

ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు సంబంధించిన ఆధారాల్ని పరిశీలించాక.. నడిగర్సంఘ భవన నిర్మాణం ఎలాంటి ఆక్రమిత స్థలంలోనూ నిర్మించడం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. న్యాయమూర్తులు కృపాకరన్- పార్థిబన్ లోతో కూడుకున్న బెంచ్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు తీర్పులో ప్రకటించడంతో ఆర్టిస్టుల సంఘంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఈ భవంతికి రెండేళ్ల క్రితం పునాది రాయి వేశారు. 31 మార్చి 2017లో రజనీ-కమల్ అతిధులుగా ముహూర్తం చేయగా ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం పూర్తవుతోంది. దాదాపు 26 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవంతి ఇది. ఇందులోనే 1000 సీట్లతో ఆడిటోరియమ్ని నిర్మిస్తున్నారు. ప్రివ్యూ థియేటర్- పెళ్లిళ్లకు హాల్ కూడా ఇందులో ఉంటుందట. ఇకపోతే టాలీవుడ్ లోనూ మూవీ ఆర్టిస్టుల సంఘం ఓ భారీ భవంతిని నిర్మించేందుకు నిధులు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer