వెండితెర అద్భుతానికి 10 ఏళ్ళు

0

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సినిమా విడుదలైంది. చిరంజీవి వారసుడిగా అప్పటికి అతని వయసు ఒక్క సినిమానే. అది కూడా కమర్షియల్ గా జస్ట్ పాస్ అయ్యింది. అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడితో ఆ టైంలోనే నలభై కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ మగధీర ప్రకటించినప్ప్పుడు మేనల్లుడి మీద ప్రేమతో ఖర్చు ఎక్కువ పెడుతున్నారని కామెంట్స్ వచ్చాయి. ఆయన ఇవేవి లెక్క చేసే రకం కాదు కాబట్టి జక్కన్నకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అడిగినవన్నీ అందించి చరణ్ కు ఎప్పటికి మర్చిపోలేని అల్టిమేట్ మూవీ ఇవ్వాలని మాత్రం కోరారు. రాజమౌళి మాట తప్పలేదు. గురి వీడలేదు.

కట్ చేస్తే 2009లో జులై 31 టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. అదే మగధీర. మొదటి షో సూపర్ హిట్ టాక్ తో మొదలై ప్రతి ఆటకు జాతరను తలపించే వాతావరణంతో థియేటర్ ఓనర్లను కలెక్షన్లు ఉక్కిరిబిక్కిరి చేశాయి. మగధీర ఆడిన కనీసం 50 రోజుల దాకా సినిమా హాళ్ల స్టాఫ్ కు సరైన నిద్ర కూడా లేదంటే అతిశయోక్తి కాదు. టికెట్ల అమ్మకాలతో మొదలుకుని క్యాంటీన్ బిజినెస్ దాకా ప్రతి ఒక్కటి నెవెర్ బిఫోర్ రికార్డ్.

రాజమౌళి చరణ్ లు విడివిడిగా ఎన్ని సినిమాలు చేసినా చెరొకరికి బాహుబలి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా మగధీర మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం లైఫ్ టైంకు సరిపడేవి. అప్పటిదాకా 78 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 302 కేంద్రాల్లో 50 రోజులు 223 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని మగధీర సృష్టించిన సునామి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కర్నూల్ లో ఏకధాటిగా 757 రోజులు 4 షోలతో ఆడటం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ రికార్డే. ఇక జిల్లాల వారీగా రికార్డులు రాసుకుంటూ పోతే అదో పెద్ద పుస్తకంగా మారుతుంది.

ఇప్పటితో పోల్చుకుంటే అప్పటి టికెట్ ధరలు సగం కంటే తక్కువగా ఉండటం మర్చిపోకూడని అంశం. సోలో నిర్మాతగా గీత ఆర్ట్స్ ఈ ఒక్క సినిమా నుంచే 58 కోట్ల షేర్ అందుకుందని అప్పట్లో శిరీష్ తన బ్లాగ్ లో పోస్ట్ చేయడం సెన్సేషన్. ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. మగధీర తర్వాత ఆ స్థాయిలో ఇతర సినిమాలు సక్సెస్ అయినప్పటికీ ఇది ఎన్నటికీ మర్చిపోలేని మెమరీగా నిలిచిపోయింది. అందుకే ఈ స్వీట్ మెమరీని ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
Please Read Disclaimer