మహేష్-బన్నీ: ప్రమోషన్స్ లో కూడా పోటీనే

0

ప్రతిసారి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోటీ ఆసక్తికరంగా ఉంటుంది కానీ ఈసారి మరింత రసవత్తరంగా మారింది. మొదట్లో పోస్టర్లతో.. లిరికల్ సాంగ్స్ తో మొదలైన పోటీ.. రిలీజ్ డేట్ల వరకూ కొనసాగింది. విడుదల తేదీల హంగామా సద్దుమణిగింది.. ఇక కలెక్షన్ల పోటీ ఉంటుంది అనుకున్నారు. అయితే అంతలోపే మరో విషయంలో పోటీ పడుతున్నారు మహేష్.. అల్లు అర్జున్.

సాధారణంగా మన స్టార్ హీరోలు సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు స్టార్ హోటల్స్ ను వేదికగా ఎంచుకుంటారు. అక్కడైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి.. 24×7 ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చినా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే ఈసారి మన సంక్రాంతి స్టార్లు అన్నపూర్ణ స్టూడియో -7 ఏకర్స్ లో ప్రమోషన్స్ చేపట్టారు. ఇక్కడే మీడియాతో సమావేశం అవుతున్నారు.. విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక ఫ్లోర్ లో మహేష్ బాబు.. మరో ఫ్లోర్ లో అల్లు అర్జున్ ఇలా తమ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

ఇద్దరు ప్రమోషన్స్ చేస్తున్న ఫ్లోర్లు కూడా పక్కపక్కనే కావడం మరో విశేషం. దీంతో అన్నపూర్ణ స్టూడియో మీడియా ప్రతినిథులతో.. జర్నలిస్టులతో కెమెరామెన్ లతో కళకళలాడుతోందట. ఒకే చోట ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడంతో మీడియావారికి కూడా సౌకర్యంగా ఉందని అంటున్నారు. పోటీ ఎలా ఉన్నప్పటికీ ఒకే లొకేషన్ లో ఇద్దరు హీరోలు ప్రమోషన్స్ చెయ్యడం ఆసక్తికరమనే చెప్పాలి.
Please Read Disclaimer