తప్పు బన్నీదేనా.. బాయ్ కాట్ అంటున్న మహేష్ ఫ్యాన్స్?

0

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ అందరి దృష్టి మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అల వైకుంఠపురములో’ చిత్రాలపైనే ఉంది. పోటీ కూడా ప్రధానంగా ఈ సినిమాల మధ్యే ఉంటుంది.. బడ్జెట్ కూడా ఈ సినిమాలదే ఎక్కువ. ఇక ప్రచార ఆర్భాటం.. విడుదల తేదీల రచ్చ కూడా ఈ సినిమాలదే ఉంది. మొదట్లో ఎలా ఉన్నప్పటికీ ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న.. ‘అల వైకుంఠపురములో’ జనవరి 12 వస్తుంది అని పోస్టర్లు కూడా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ నాలుగు రోజుల నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

అల్లు అర్జున్ టీమ్ తమ సినిమాను ప్రీపోన్ చేసి 10 వ తారీఖునే రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు షాక్ తిన్నారు. ప్రకటించినట్టుగా 11 న వచ్చినా.. లేక ముందుకు జరుపుకుని 10 వ తేదీనే విడుదల చేసినా ‘సరిలేరు నీకెవ్వరు’కు మొదటి రోజు థియేటర్ల షేరింగ్ తప్పదు. ఆ మేరకు ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో కోత తప్పదు. దీంతో రిలీజ్ డేట్ విషయం ఏం చెయ్యాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు. తెరవెనుక ఏం జరిగిందనేది పక్కన పెడితే రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ మొదలైంది మాత్రం ‘అల వైకుంఠపురములో’ టీమ్ వల్లే అనేది చాలామంది నమ్ముతున్నారు. అయితే అల ‘వైకుంఠపురములో’ టీమ్ మాత్రం ఇంకా అధికారికంగా పదవ తేదీ రిలీజ్ డేట్ అని ప్రకటించకుండా దోబూచులాడుతూ ఉండడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అదే స్ట్రేటజీ ఫాలో అవుతోంది. రెండు సినిమాల వారు సెన్సార్ పోస్టర్లలో రిలీజ్ డేట్ ను ముద్రించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సూపర్ స్టార్.. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వాదోపవాదాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో అల్లు అర్జున్ టీమ్ ఉద్దేశపూర్వకంగా తికమక పెంచుతూ ఇతర సినిమాల మేకర్లను ఇబ్బంది పెడుతున్నారని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చెప్పిన డేట్ కు రాకుండా ఇతర సినిమాలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాడని బన్నీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీ మొదటి నుంచి ఇలాంటివి చేయడం అలవాటని.. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో జరిగిన రచ్చ గుర్తు చేస్తున్నారు. ఈసారి మహేష్ తో గిల్లికజ్జాలు ఆడుతున్నాడని అంటున్నారు. కొందరైతే ఇంకా ముందుకెళ్లి బన్నీ సినిమాను బాయ్ కాట్ చేయాలనీ మహేష్ ఫ్యాన్స్ కు పిలుపునిస్తున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్న సంగతి తెలిసిందే. దీంతో మహేష్ సినిమాకు మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటుందని.. బన్నీ టీమ్ లేనిపోని పంతాలతో మహేష్ ను ఇబ్బంది పెడుతూ మహేష్ ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ మద్దతు కూడా కోల్పోయే అవకాశం కూడా ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ టీమ్ ఇవన్నీ గమనిస్తున్నారా.. రిలీజ్ డేట్ పై ఏం ఆలోచిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer