సర్కారు ఆధార్ కార్డు పేరుతో.. భారీ క్లాస్ పీకాడుగా?

0

ఎవరు అవునన్నా.. కాదన్నా సినిమా పవర్ ఫుల్ మాథ్యమం అన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. సానుకూలంగా ఉన్నప్పుడు ఒకలా.. ప్రతికూల పరిస్థితుల్లో సినిమా ప్రభావం సమాజం మీద ఏముంటుందంటూ కన్వీనీయంట్ గా మాట్లాడటం కనిపిస్తుంది. కానీ.. చెప్పాల్సిన రీతిలో చెప్పాలే కానీ.. పలు అంశాల మీద కొత్త చర్చకు తెర తీసే శక్తి సినిమాలకు ఉందన్నది మర్చిపోకూడదు.

త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలతో విద్యా వ్యవస్థ మీద మొదలైన చర్చ దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో దర్శకుడు అనిల్ రావిపూడి సంధించిన కొన్ని అస్త్రాలు పాలకుల మీదా.. ప్రభుత్వాల మీదా వాడివేడిగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఆధార్ కు పాన్ కార్డు లింకేజీకి సంబంధించి తన తాజా చిత్రంలో ఆయన వేసిన ప్రశ్నలు ఆలోచించేవిగా ఉండటమే కాదు.. ప్రభుత్వానికి తనదైన శైలిలో క్లాస్ పీకిన తీరును అభినందించాల్సిందే.

లైటర్ వీన్ లో వంక పెట్టేందుకు వీల్లేకుండా పాలకుల్ని నిలదీసిన వైనం ప్రజల మధ్య అంతో ఇంతో చర్చను స్టార్ట్ చేస్తుందని చెప్పక తప్పదు. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి ఆధార్.. పాన్ కార్డు (ఇప్పటికి కొంతమందికే ఉన్నాయనుకోండి) లింక్ చేసి.. ఏమేం ఖర్చు చేశాం? ఎలా ఖర్చు చేశామని ట్రాక్ చేసే ప్రభుత్వం.. తనకొచ్చే ఆదాయం.. ఖర్చు చేసే ఖర్చులకు సంబంధించిన లెక్కా పత్రాన్ని ట్రాక్ చేసేందుకు అవసరమైన యాక్సిస్ ప్రజలకు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించిన ప్రశ్న ఆలోచించేలా ఉండటమే కాదు.. ప్రజాస్వామ్యంలోని ప్రజాప్రభుత్వం చేయాల్సిన పని ఇదే కదా? అన్న భావన కలుగక మానదు.

తన చిత్రంలో హీరో చేత ఆవేశంగా డైలాగులు చెప్పించినప్పటికీ.. ఒక కీలకమైన విషయాన్ని తనదైన శైలిలో దర్శకుడు అనిల్ రావిపూడి.. ప్రజలు చెల్లించే పన్నుల్ని ఖర్చు చేసే ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించటంతో పాటు.. పారదర్శకత విషయంలో మరింత ముందుకు వెళ్లాలన్న విషయాన్ని తన తాజా సినిమాతో చెప్పేశారని చెప్పాలి. సినిమా ఎలా ఉందన్నది కాసేపు పక్కన పెడితే.. ఈ ప్రయత్నాన్ని మాత్రం అభినందించాలని చెప్పక తప్పదు.
Please Read Disclaimer