పట్టుబట్టి మరీ మహేష్ ను ఒప్పించాడట!

0

టాలీవుడ్ సినిమాల లో పాటలకు డ్యాన్సులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కమర్షియల్ సినిమాలలో ప్రేక్షకులు వాటిని తప్పని సరిగా ఆశిస్తారు. అయితే స్టార్ హీరోలు అందరూ బ్రిలియంట్ డాన్సర్లు కాలేరు కదా. మహేష్ బాబు కూడా అంతే. తన కెరీర్ మొదట్లో మహేష్ మంచి స్టెప్పులే వేసేవారు కానీ ఈమధ్య మాత్రం డ్యాన్స్ పై పెద్దగా శ్రద్ద చూపించడం లేదు. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ లో మాత్రం మహేష్ తన డ్యాన్స్ తో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ‘డాంగ్ డాంగ్’ లో మహేష్ స్టెప్పులు ఇప్పటికే అందరినీ ఆకర్షించాయి. అయితే మహేష్ ఇలా డ్యాన్స్ పై శ్రద్ధ పెట్టడానికి కారణం ఏంటో తెలుసా?

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మార్పుకు కారణమట. మహేష్ ఈమధ్య సినిమాల్లో డ్యాన్స్ ఏదో అయిందంటే అయిందనిపిస్తున్నారు. ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశపడుతున్నారని.. ‘సరిలేరు నీకెవ్వరు’ ఒక పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి మంచి డ్యాన్స్ ఉండాల్సిందేని పట్టు బట్టారట. మహేష్ మొదట ఈ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని.. అయితే అనిల్ మాత్రం డ్యాన్స్ మాస్టర్లతో చర్చించి మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు మంచి గ్రేస్ ఉండే స్టెప్పులు ఉండేలా చూడడంతో మహేష్ కూడా డ్యాన్సులకు రెడీ అయ్యారని సమాచారం. మరీ కఠినమైన స్టెప్పులు కాకుండా మహేష్ కు తగ్గట్టే డిజైన్ చెయ్యడంతో ఉత్సాహంతో డ్యాన్స్ చేశారని అంటున్నారు. ఈ సినిమాలో ‘డాంగ్ డాంగ్’.. ‘మైండ్ బ్లాక్’ పాటలలో మహేష్ డ్యాన్స్ ఒక ట్రీట్ లాగా ఉంటుందని ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ సభ్యులు అంటున్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయశాంతి.. ప్రకాష్ రాజ్.. సంగీత.. బండ్ల గణేష్ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 5 వ తేదీ హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
Please Read Disclaimer