బన్నీ చెప్పాడు కానీ మహేష్ చెప్పలేదే!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. భారీ పోటీ మధ్య విడుదలవుతున్న సినిమా కావడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈమధ్యే ‘అల వైకుంఠపురములో’ టీమ్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా జరిపారు. సహజంగా రిలీజుకు ముందు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు తమ సినిమా గురించి తప్ప పోటీలో ఉన్న ఇతర సినిమాల గురించి మాట్లాడరు. కానీ అల్లు అర్జున్ మాత్రం పోటీలో ఉన్న సినిమాల గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

“మా సినిమాతో పాటు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నేను సరిలేరు నీకెవ్వరు టీమ్ అందరికీ.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. టెక్నిషియన్స్.. మహేష్ బాబు గారికి అల్ ది బెస్ట్” అని చెప్పారు. ఈ సంక్రాంతి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు. సంక్రాంతికి విడుదలవుతున్న మరో సినిమా ‘ఎంత మంచివాడవురా’ సినిమాకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ రామ్ తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని.. ఆ సినిమాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సంక్రాంతి సినిమాల్లో పోటీ అంతా ‘సరిలేరు నీకెవ్వరు’.. ‘అల వైకుంఠపురములో’ మధ్యే ఉంది. ప్రచార కార్యక్రమాల నుంచి మొదలు పెడితే విడుదల తేదీల వరకూ అంతా పోటీనే. అయినా అల్లు అర్జున్ ఇలా మహేష్ బాబు సినిమాకు ఆల్ ది బెస్ట్ తెలపడంతో సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రొఫెషనల్ గా పోటీ ఉన్నప్పటికీ ఇలా ఇతర సినిమాలకు అభినందనలు తెలపడం మంచి పరిణామం అంటున్నారు. అయితే మహేష్ బాబు నుంచి కానీ.. అటు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ నుంచి కానీ దీనిపై స్పందన లేదు. అల్లు అర్జున్ సినిమాకు ఎవరూ ఆల్ ది బెస్ట్ చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్లు మహేష్ బాబు కనీసం ఒక ట్వీట్ ద్వారా అయినా ‘అల వైకుంఠపురములో’ టీమ్ కు అల్ ది బెస్ట్ చెప్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రిలీజ్ లోపు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ నుంచి ఎవరైనా రిలీజ్ లోపు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer