రెండు దశాబ్ధాల రాజకుమారుడు

0

మహేష్ కథానాయకుడిగా నటించిన తొలి సినిమా `రాజకుమారుడు`. 30 జూలై 1999లో రిలీజైంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ దాదాపు 5 కోట్ల (2.3 మి.డాలర్లు) బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తే ఆ రోజుల్లోనే 11 కోట్ల షేర్ (4.9 మిలియన్ డాలర్లు) వసూలైంది. డాలర్ల విలువను పరిగణించి నేటితో పోలిస్తే.. అప్పట్లోనే అశ్వనిదత్ ఆ చిత్రానికి 16 కోట్ల బడ్జెట్ పెడితే.. 34 కోట్ల షేర్ వసూలైనట్టు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇది ఘనమైన ఆరంగేట్రం.

30 జూలై 2019తో `రాజకుమారుడు` 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే మహేష్ హీరో అయ్యి రెండు దశాబ్ధాలు అయ్యింది. ఈ కాలంలో అతడు ఇంతింతై అన్న చందంగా ఎదిగిన తీరు అసామాన్యం అనే చెప్పాలి. ప్రిన్స్ కాస్తా సూపర్ స్టార్ అన్న పిలుపును అందుకున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఇంతింతై సూపర్ స్టార్ అన్నంతగా ఎదిగిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. నేడు 200 కోట్ల గ్రాస్ తెచ్చే హీరో. 100 కోట్ల షేర్ గ్యారెంటీ ఉన్న హీరోగా మహేష్ ఎదిగారు. రాజకుమారుడు షేర్ 11 కోట్లు .. మహర్షి షేర్ 100 కోట్లు.. అంటే 20 ఏళ్లలో పదింతలు మార్కెట్ వ్యాల్యూ పెరిగింది.

ప్రస్తుతం మహేష్ తన కెరీర్ 26వ సినిమాలో నటిస్తున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ 27.. మహేష్ 28 చిత్రాలకు స్క్రిప్టు వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ ప్రస్తుతం ఇరుగు పొరుగు మార్కెట్లపైనా గ్రిప్ సంపాదిస్తున్నారు. అలాగే నిర్మాతగా మారి కొత్త ట్యాలెంటును ప్రోత్సహించే ప్లాన్ లో ఉన్నారు. ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ లో .. హంబుల్ పేరుతో వస్త్ర శ్రేణి వ్యాపారంలోనూ అడుగు పెట్టారు.
Please Read Disclaimer