20% ఆక్సిజన్ ఇక నిల్.. సూపర్ స్టార్ ఆవేదన

0

పర్యావరణ అసమతుల్యత.. ప్రస్తుతం ముంచుకొస్తున్న పెనుముప్పు అన్న సంగతి తెలిసిందే. నగరీకరణ నేపథ్యంలో అడవుల్ని నరికేయడం ప్రకృతి అసమతుల్యతకు కారణమవుతోంది. పైగా చెట్ల పెంపకం అన్నది మానవాళి మర్చిపోతుండడంపైనా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మరో ఊహించని ఉత్పాతం గుండెలు గుభేల్మనేలా చేస్తోంది. మానవాళికి 20శాతం ఆక్సిజన్ ని అందిస్తున్న ప్రఖ్యాత అమెజాన్ రెయిన్ ఫారెస్ట్స్ (దక్షిణ అమెరికా) ధగ్ధం కావడం సంచలనంగా మారింది.

ఈ విషయంలో తొలిగా మేల్కొలుపు మాట చెప్పిన సూపర్ స్టార్ మహేష్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. “లోతుగా కలచివేసిన వార్త ఇది. మన భూగ్రహానికి ఊపిరితిత్తులు అని చెప్పుకునే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అగ్నికి ఆహుతి అవుతోంది. 20శాతం ఆక్సిజన్ అక్కడి నుంచే పర్యావరణంలోకి అందుతోంది. ఇది భూమిపై నివశించేవారంతా నిదుర లేవాల్సిన తరుణం అని గ్రహించాలి. అమెజాన్ కోసం ప్రార్థించండి“ అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అమెజాన్ అడవులు తగలబడుతున్న దృశ్యం ఫోటోని మహేష్ ఫ్యాన్స్ కి షేర్ చేశారు.

మన ప్లానెట్ ఊపిరి తిత్తులు తగలబడిపోతున్నాయ్! అంటూ మరో ట్వీట్ లోనూ మహేష్ ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతోంది. మన భూమిని కాపాడుకునేందుకు ఏదైనా చేయాలన్న తపన ఆయనలో వ్యక్తమైంది. పచ్చదనాన్ని కాపాడడం.. ప్రతి ఒక్క మనిషిలో ఒక ఉద్యమంగా మారాలని కోరుకుందాం. తొలిగా ఇంటి వద్దనే మనం పచ్చదనం పెంచే ఉద్యమం చేపడదాం!!
Please Read Disclaimer