ప్రత్యక్ష దైవాలు మీరే.. మీ అందరికి సెల్యూట్ : మంచు లక్ష్మి

0

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. సంపూర్ణ లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతుండటం అందర్నీ కలవరపెడుతోంది. అయితే ఈ విపత్కర సమయంలో కూడా పోలీసులు వైద్య సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక కరోనా వ్యాప్తి అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు ప్రభుత్వానికి ప్రధాన సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై మంచు లక్ష్మి స్పందించి ఓ వీడియో ద్వారా పోలీసులు చేస్తున్న సేవలకు సెల్యూట్ చేసారు.

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ”హైదరాబాద్ సిటీ పోలీసులందరికీ పెద్ద సెల్యూట్. నిజంగా ఈ లాక్ డౌన్ లో మీరెంత కష్టపడి పని చేసారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 98 మంది పోలీసులు కరోనా బారినపడి కోలుకొని మళ్ళీ విధుల్లో పాల్గొన్నారని విన్నాను. వాళ్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరే మా సూపర్ మ్యాన్స్ స్పైడర్స్ మ్యాన్స్.. హనుమాన్ రాముడు కృష్ణుడు అని పుస్తకాల్లో చదువుకున్నాం. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలు మాత్రం మీరే” అంటూ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా మా జాగ్రత్తల గురించి మా కోసం మీ ఫ్యామిలీస్ ని వదిలేసి బయటకొచ్చి మమ్మల్ని కాపాడుతున్న మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది తీరని ఋణం. మీరు త్వరగా రికవరీ అయి డ్యూటీలో జాయినై మరింత స్ట్రాంగ్ గా వర్క్ చేయగలుగుతారని అనుకుంటున్నాను. అతి త్వరలో మనమంతా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు.