మంచు హీరోల ధైర్యమేంటి?

0

గత కొన్నేళ్లలో మంచు వారి కుటుంబం నుంచి వచ్చిన సినిమాల పరిస్థితేంటో తెలిసిందే. ఒకరిని మించి ఒకరు బాక్సాఫీస్ దగ్గర జీరోలైపోయారు. మోహన్ బాబు సినిమాల్లో నటించడం ఎప్పుడో తగ్గించేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ఫాలోయింగ్ మార్కెట్ గురించి చెప్పాల్సిన పని లేదు. మంచు లక్ష్మిది ఎప్పుడూ పార్ట్ టైం వ్యవహారంలా ఉంటుంది కాబట్టి ఆమె సంగతి కూడా పక్కన పెట్టేద్దాం. కానీ టాలీవుడ్లో మిగతా వారసుల్లో తన కొడుకుల్ని కూడా పెద్ద స్టార్లుగా చూడాలని ఆశపడి మంచు విష్ణు మంచు మనోజ్ల మీద ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాడు మోహన్ బాబు. కానీ వాళ్లు నిలదొక్కుకోలేకపోయారు. మధ్యలో కాస్తంగా మార్కెట్ సంపాదించుకున్నట్లు కనిపించారు కానీ.. మళ్లీ ఫాం కోల్పోయారు. విష్ణు చివరి సినిమాలు ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘ఓటర్’ దాదాపు జీరో షేర్ మిగిల్చాయి. మంచు మనోజ్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’కు కూడా దారుణమైన ఫలితమే వచ్చింది.

ఐతే ఈ ఇద్దరూ ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నారు. విష్ణు ‘మోసగాళ్ళు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ఓ ఫారిన్ డైరెక్టర్ను పెట్టుకున్నాడు విష్ణు. దీని బడ్జెట్ బిజినెస్ సంగతులు పక్కన పెడితే.. దీని తర్వాత ‘కన్నప్ప’ సినిమా చేయబోతున్నానని.. బడ్జెట్ రూ.95 కోట్లని.. కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని.. దీనికి ఓ హాలీవుడ్ డైరెక్టర్ పని చేస్తాడని.. అక్కడే స్క్రిప్టు వర్క్ జరుగుతుందని గొప్పలు పోతూ చెప్పుకొచ్చాడు విష్ణు. కానీ తిప్పి కొడితే రూ.5 కోట్ల మార్కెట్ కూడా లేని హీరో రూ.95 కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడుతుంటే వినే జనాలకు కామెడీగా అనిపిస్తోంది.

‘మోసగాళ్ళు’ హిట్టయినా కూడా విష్ణు మార్కెట్ పది కోట్లకు మించి పెరిగే అవకాశం లేదు. అలాంటిది అంత బడ్జెట్ ఎలా వర్కవుట్ అవుతుందనుకుంటున్నాడు? విష్ణు సంగతిలా ఉంటే.. మనోజ్ కూడా రీఎంట్రీలో భారీ ప్రయత్నం చేస్తున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో పాన్ ఇండియా సినిమా అంటున్నాడు. దాని బడ్జెట్ రూ.30 కోట్లకు పైమాటే అంటున్నారు. కానీ అతడి మీద ఇంత బడ్జెట్ అంటే చాలా పెద్ద రిస్కే. దీన్ని అతనెలా వర్కవుట్ చేయాలనుకుంటున్నాడో తెలియదు. ముందు కంటెంట్ మీద దృష్టిపెట్టి చిన్న బడ్జెట్ సినిమాలు చేసి అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేయకుండా వీళ్లిద్దరూ ఇలాంటి భారీ ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కాని విషయం.
Please Read Disclaimer