రాత్రి ఫైనల్ మ్యాచ్..ఉదయం పెళ్లి!

0

కర్ణాటక స్టార్ బ్యాట్స్ మన్ – భారత క్రికెట్ జట్టు సభ్యుడు మనీష్ పాండే ఓ ఇంటి వాడయ్యాడు. ఇందులో అంత విశేషం ఏముంది అంటారా? అతను సోమవారం ముంబయిలో పెళ్లి చేసుకోగా.. ముందు రోజు రాత్రి సూరత్ లో క్రికెట్ మ్యాచ్ ఆడటం విశేషం. అదేమీ చిన్న మ్యాచ్ కాదు. రంజీ – విజయ్ హజారె తరహాలో టీ20ల్లో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశవాళీ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ కోసం పెళ్లికి ముందు రోజు మనీష్ జట్టుతో ఉండిపోయాడు. అతను కర్ణాటకకు కెప్టెనే కాక.. జట్టులో నంబర్ వన్ బ్యాట్స్ మన్ కూడా. ఫైనల్ వరకు తీసుకొచ్చిన జట్టును విడిచి వెళ్లిపోలేక ఆదివారం మ్యాచ్ ఆడాడు మనీష్.

60 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్ గా నిలవడమే కాక.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో జట్టును అద్భుతంగా నడిపించి విజేతగా నిలిపాడు. తమిళనాడుపై కేవలం ఒక్క పరుగు తేడాతో కర్ణాటక గెలవడం విశేషం. మ్యాచ్ అవ్వగానే అతను ముంబయి ఫ్లైట్ ఎక్కేశాడు. ఉదయానికల్లా పెళ్లి వేదికకు చేరుకున్నాడు. అతను పెళ్లి చేసుకున్నది సినీ నటి అశ్రిత శెట్టిని కావడం విశేషం. ఈ అమ్మాయి తెలుగులో ఎన్ హెచ్-4 పేరుతో విడుదలైన సిద్దార్థ్ తమిళ సినిమాలో కథానాయికగా నటించింది. దీంతో పాటు మరో మూడు తమిళ సినిమాల్లో కథానాయికగా చేసింది. ఐతే ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఇంతలో మనీష్ తో ప్రేమలో పడి అతడిని పెళ్లాడింది.
Please Read Disclaimer