లొంగలేదని సినిమాల నుంచి గెంటేశారు : అల్లరి నరేష్‌ హీరోయిన్

0

బయటి నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే ప్రతీ అమ్మాయీ క్యా్స్టింగ్ కౌచ్‌ని ఎదుర్కోవాల్సిందేనేమో. మీటూ ఉద్యమం పుణ్యమా అని ఎందరో హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టగలిగారు. తీగ లాగితే డొంక కదిలినట్లు రోజుకో కథ బయటికి వస్తోంది. తాజాగా ప్రముఖ నటి మంజరి ఫడ్నిస్ తాను ఎదుర్కొన్న ఇబ్బందికర సంఘటన గురించి మీడియాతో పంచుకున్నారు.

‘15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇంత సుదీర్ఘ కెరీర్ ఉన్నప్పటికీ నేను చేసిన సినిమాల కంటే పోగొట్టుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం ఫలానా డైరెక్టర్‌కో ప్రొడ్యూసర్‌కో లొంగకపోవడం. వాళ్లు అడిగిన దానికి ఒప్పుకోలేదని నన్ను సినిమాల నుంచి తొలగించేసేవారు. అంతేకాదు వారి వల్ల భారీ కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు కూడా పోగొట్టకోవాల్సి వచ్చింది. అందుకే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాల్లో మాత్రమే నటించేదాన్ని. కానీ అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యేవి. ఈ ఘటనల వల్ల చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉండిపోయాను. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువ. అయితే వాటిని ఒప్పుకోవాలని ఎవ్వరూ బలవంతం చేయరు. నా ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేక ఎందరో పెద్ద నిర్మాతల సినిమాలకు నో చెప్పాను. కొన్నిసార్లు సినిమాలకు సంతకం చేసేశాక కోరికలు తీర్చమని అడిగేవారు’

‘దాంతో నేను తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చేసి సినిమాల నుంచి నేనే తప్పుకునేదాన్ని. అవకాశాల కోసం సెక్స్‌కి ఒప్పుకునే అమ్మాయిని కాదని ఈపాటికి అందరు నిర్మాతలకు తెలిసి ఉంటుంది. ఓసారి దక్షిణాది నిర్మాత నుంచి నాకు పిలుపు వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలో నాకు అవకాశం ఇస్తానన్నాడు. కానీ దాని వల్ల నాకు లాభమేంటి అని అడిగాడు. నేను బాగా కష్టపడి నటిస్తానని చెప్పాను. కానీ ఆ విషయం నాకు అనవసరం అన్నాడు. అప్పుడు అర్థమైంది మనసులో దురుద్దేశంతో నన్ను పిలిపించాడని. హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడితే అన్ని నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు తగ్గిపోతాయి. ఇన్నేళ్ల నా కెరీర్‌లో నేను నటించిన ‘ఇంటర్‌డిపెండన్స్’ సినిమా ఒక్కటే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా 11 మంది దర్శకులు తెరకెక్కించిన షార్ట్ ఫిలింస్‌ ఈ ఒక్క సినిమాలో కనిపిస్తాయి’ అని తెలిపారు మంజరి.
Please Read Disclaimer