కేసుల దాకా వచ్చాక కుండ బద్ధలు కొట్టేయొచ్చుగా బాసూ?

0

మలయాళ చిత్రరంగంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శ్రీకుమార్ మీద సంచలన ఆరోపణలు చేశారు సీనియర్ నటి మంజూవారియర్. మలయాళ చిత్రరంగంలో మంచి పేరున్న ఈ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వివాదం గడిచిన రెండు రోజులుగా హాట్ టాపిక్ గా మారింది. తనను చంపుతానని బెదిరించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.

తనను వేధింపులకు గురి చేశారని ఆమె చెబుతున్నారు. సంచలన విజయాన్ని సాధించిన ఒడియన్ చిత్రంలో మంజూవారియర్ నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీకుమార్ మేనన్. సోషల్ మీడియా వేదికగా శ్రీకుమార్ తననే కాదు.. తన స్నేహితుల్ని సైతం వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఆరోపించారు.

ఉత్త మాటలే కాదు.. తాను చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలతో ఆమె కొన్ని ఫోటోల్ని కూడా పోలీసులకు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఫేస్ బుక్ లో సదరు దర్శకుడు ఆసక్తికర పోస్టు ఒకటి పోస్ట్ చేశారు. మంజు.. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు సాయం చేసింది నేను మాత్రమే. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావా? నా వల్లే నీకు అనేకమందితో పరిచయం ఏర్పడింది? ఈ విషయాన్ని నువ్వెందుకు మర్చిపోతున్నావ్? అంటూ ప్రశ్నించారు.

అంతేకాదు.. తనపై చేసిన ఫిర్యాదును మీడియా ద్వారా తనకు తెలిసిందని.. తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. తనకు.. మంజూ వారియర్ కు మాత్రమే తెలిసిన ఎన్నోనిజాలను ఈ విచారణలో బయటపెడతానంటూ పెట్టిన వ్యాఖ్యపై ఇప్పుడు కొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. దర్శకుడి ఫేస్ బుక్ పోస్టుతో మంజూ వారియర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది.