ఎట్టకేలకు ఈ మిస్సుకో ఛాన్సు!

0

2017 లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది మానుషి చిల్లర్. ఐశ్వర్యారాయ్- సుశ్మితాసేన్- ప్రియాంక చోప్రా తరహాలోనే ఈ అమ్మడు కూడా ప్రపంచ సుందరి అవ్వగానే రంగుల ప్రపంచంలో ప్రవేశం కోసం ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నానని ప్రకటించింది. తనకు బాలీవుడ్ కథానాయికగా అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమేనని ప్రకటించడంతో వెంటనే తనకు అవకాశాల వెల్లువ ఉంటుందనే అభిమానులు భావించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. ఈ అమ్మడికి బాలీవుడ్ పిలుపు అంత సులువుగా ఏం దక్కలేదు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్.. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వంటి స్టార్ల సరసన నటించాలని మానుషి కలగన్నా.. వారి నుంచి పిలుపు రాలేదు. సరికదా! అసలు ఎవరూ పట్టించుకున్నదే లేదు.

ఆ క్రమంలోనే ఈ అమ్మడు రెండేళ్లుగా అందరు టాప్ మోడల్స్ లానే ప్రయత్నాలు కొనసాగించింది. అలుపెరగకుండా.. వరుస ఫోటోషూట్లతో అంతర్జాలంలో విరుచుకుపడింది. అప్పట్లో ప్రఖ్యాత సభ్యసాచి వెడ్డింగ్ డిజైనర్ ఫోటోషూట్ లో పాల్గొని నవవధువు గెటప్ లో ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే బాలీవుడ్ ఎంట్రీకి ఇంకెంతో సమయం లేదన్న క్లూ కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత కూడా వెంటనే తన డెబ్యూ సినిమా గురించి ప్రకటిస్తుందనుకుంటే అది సాధ్యపడలేదు. తన నుంచి ప్రకటన కోసం ఫ్యాన్స్ ఇప్పటివరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన కోరిక నెరవేరుతోంది. తొలి అవకాశం అంది వచ్చింది. అది కూడా కిరీటం గెలుచుకున్న రెండేళ్లకు. అయితే లేటయినా లేటెస్టుగా కిలాడీ అక్షయ్ కుమార్ సరసన జాక్ పాట్ కొట్టేసింది. పైగా ఇది ఓ భారీ హిస్టారికల్ సినిమా. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి మొదలైంది.

మానుషి డెబ్యూ సినిమాకి `పృథ్వీరాజ్` అనే టైటిల్ ఇప్పటికే ఫిక్సయ్యింది. చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ప్రేమికురాలు సన్యోగిత పాత్రను మానుషి పోషించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. తన తొలి చిత్రం గురించి మనుషి చిల్లర్ మాట్లాడుతూ “యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి ప్రొడక్షన్ హౌస్ నన్ను హీరోయిన్ గా ఎంపిక చేయడం చాలా గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది. నా జీవితంలో నిజంగా ఇదో గొప్ప అవకాశం. ఒక అద్భుత కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మిస్ ఇండియాగా నిలిచి ఆ తరువాత మిస్ వరల్డ్ అవ్వడం వరకూ ఒక ఎత్తు. ఇప్పుడు నా తొలి చిత్రం ఇంత పెద్ద ప్రాజెక్ట్ కావడం లైఫ్ లో కీలక మలుపు. ఉత్సాహం నింపే కొత్త అధ్యాయం మొదలైంది“ అంటూ ఉబ్బితబ్బిబ్బయ్యింది. అయితే ఈ భామ అదృష్టం ఎలా ఉంది? అన్నది చూడాలి. ఐశ్వర్యారాయ్.. ప్రియాంక చోప్రా రేంజులో మానుషి వెలుగుతుందా లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer