‘పుష్ప’ తర్వాత బోయపాటితోనే బన్నీ సినిమా..!

0

‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘పుష్ప’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు ప్రధాన భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండు భాగాలుగా విడుదల కానుంది. భవిష్యత్ లో అన్నీ పాన్ ఇండియా చిత్రాలే చేయాలని నిర్ణయించుకున్న బన్నీ.. దానికి తగ్గట్టుగానే ఏఆర్ మురగదాస్ – బోయపాటి శ్రీను – కొరటాల శివ – ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులను లైన్ లో పెట్టాడు. ఇటీవలే బన్నీ స్నేహితుడు బన్నీ వాస్ ఈ లైనప్ గురించి వివరించారు. అయితే అల్లు అర్జున్ తో సినిమాలు చేయబోయే దర్శకుల ఆర్డర్ పై క్లారిటీ రాలేదు.

ఇప్పటికే ‘పుష్ప 1’ చిత్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ అయింది. రీసెంటుగా ప్రారంభించిన షెడ్యూల్ లో మిగతా చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ‘పుష్ప’ పార్ట్-1 తర్వాత వెంటనే ‘పుష్ప 2’ చేయకుండా.. వేరే ప్రాజెక్ట్ చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారు. అందుకే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాని ముందు పూర్తి చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ కథని పాన్ ఇండియా స్క్రిప్ట్ మార్చే పనిలో ఉన్నారని టాక్.

అల్లు అర్జున్ ‘ఐకాన్’ సినిమా ముగించుకుని వచ్చే సమయంలో విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ‘పుష్ప 2’ పనులు మొదలు కానున్నాయి. దీని తర్వాత ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ సినిమా చేసే అవకాశం ఎక్కువగా ఉందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. గతంలో బన్నీ – బోయపాటి కాంబోలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. స్టైలిష్ స్టార్ లోని మాస్ యాంగిల్ ని కంప్లీట్ గా బయట పెట్టింది. అందుకే వీరి కలయికలో మళ్ళీ ఓ సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేయడానికి ఆల్రెడీ బోయపాటి అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే కంఫర్మేషన్ వస్తుందేమో చూడాలి.

ఇకపోతే కొరటాల శివ – మురుగదాస్ – ప్రశాంత్ నీల్ లతో కూడా అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నారు. ఇటీవల ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.థాను.. బన్నీ తో ఓ ప్రాజెక్ట్ కోసం చర్యలు జరుగుతున్నాయని వెల్లడించారు. దీంతో అల్లు అర్జున్ – ఏ.ఆర్ మురుగదాస్ కాంబోలో రూపొందనున్న చిత్రాన్ని V క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.థాను నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది మురగదాస్ సినిమానా లేదా మరో కొత్త మూవీనా అనే దానిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక కొరటాల శివ – బన్నీ కాంబినేషన్ లో సినిమా హోల్డ్ లో పడినప్పటికీ.. ప్రస్తుతమున్న స్టార్ డైరెక్టర్ కమిట్మెంట్స్ పూర్తైన తర్వాత వీరు కలసి సినిమా చేస్తారని తెలుస్తోంది.