మీటూ : అది నా అదృష్టం అంటున్న తమన్నా

0

మీటూ ఎఫెక్ట్ ఇండియన్ సినిమాపై చాలా పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల కెరీర్ లు తారుమారు అయ్యాయి. పలువురు స్టార్స్ మీటూ ఆరోపణలు ఎదుర్కోవడంతో అవకాశాలు కోల్పోయారు. అదే సమయంలో మీటూ ఆరోపణలు చేసిన వారికి కూడా అవకాశాలు రాకుండా పోయాయి. వారిని ఇండస్ట్రీ వారు బహిష్కరించినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంను తమన్నా కూడా అంగీకరించింది. ఇటీవల తమన్నా ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ మీటూపై తన అభిప్రాయంను తెలియజేసింది.

తమన్నా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నాకు లైంగిక వేదింపులు ఎదురు కాలేదు. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తున్న నన్ను ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. అందుకే నాకు ఎవరి నుండి కూడా సమస్య రాలేదు. నా కెరీర్ లో ఇప్పటి వరకు లైంగిక వేదింపులు ఎదురు కాకపోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ మొత్తం సాఫీగా సాగడం సంతోషం.. అయితే కొందరి కెరీర్ లో ఒడిదొడుకులు ఎదురవ్వడం దారుణం.

లైంగిక వేదింపులు ఎదుర్కొనే మహిళలు ధైర్యంగా మాట్లాడాలి. ఏదైనా విషయం వల్ల మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే దాన్ని గురించి పోరాడేందుకు ముందుకు రావాలి. మీటూ అంటూ మీడియా ముందుకు వచ్చిన వారికి.. తమకు జరిగిన అన్యాయంను చెప్పుకున్న వారికి సినిమాల్లో ఆఫర్లు తగ్గడంతో పాటు సమాజంలో వారిపై ఒకరకమైన అభిప్రాయం ఏర్పాటు అవుతుందని తమన్నా అంది. మహిళలు మానసిక ఒత్తిడిని జయించేందుకు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని.. ఎవరినైనా ఎదిరించేంత ధైర్యంను కలిగి ఉండాలంటూ తమన్నా అభిప్రాయపడింది. తెలుగు మరియు తమిళంతో పాటు హిందీలో కూడా నటిస్తున్న ఈ అమ్మడు మరికొంత కాలం బిజీ హీరోయిన్ గా కొనసాగడం ఖాయమనిపిస్తుంది.