తరుణ్ భాస్కర్ కి రిటర్న్ గిఫ్ట్ రెడీ

0

`మీకు మాత్రమే చెబుతా` అంటూ కొన్ని నిమిషాల పాటు ఓ వీడియో రౌడీ ఫ్యాన్స్ ని ఊపేసిన సంగతి తెలిసిందే. నిన్నంతా(బుధవారం) ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. రౌడీ దేవరకొండ తన ఫ్రెండు కం దర్శకుడు తరుణ్ భాస్కర్ కి అసలైన రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడని అందరికీ అర్థమైంది. పెళ్లి చూపులు సినిమాతో తనని హీరోని చేసిన దర్శకనిర్మాతని హీరోని చేస్తూ తానే సినిమాని నిర్మించాలన్న ఐడియా ఏ హీరోకి అయినా వచ్చిందా? అందుకే.. దేవరకొండ వెరీ స్పెషల్. తాను ఏం చేసినా కొత్తగా ఉండాలన్నదే అతడి కాన్సెప్టు. అందుకు తగ్గట్టే యూత్ లో అతడికి ఫాలోయింగ్ పెరుగుతోంది.

ఫ్రెండు తరుణ్ నటించిన సినిమా టైటిల్ ఇదీ .. ఎలా ఉంది? అని ఫ్యాన్స్ ని అడిగేందుకు నిన్న చిన్న టెస్ట్ పెట్టాడు. రౌడీ మార్క్ టెస్ట్ అని పొగిడేశారంతా. ఈ గురువారం `మీకు మాత్రమే చెబుతా` ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేశాడు. మీకు మాత్రమే చెబుతా చిత్రంలో తరుణ్ భాస్కర్ ఎలా కనిపించబోతున్నాడు? అన్నది ఈ పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది. తెల్ల చొక్కాపై నల్ల కోటు వేసుకున్న దొరగారి కథేమిటో? ఇది తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. షమీర్ సుల్తాన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాల్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

కింగ్ ఆఫ్ ది హిల్స్ – గ్లోబల్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవరకొండ ప్రారంభించిన `కింగ్ ఆఫ్ ది హిల్స్` బ్యానర్ లో తొలి సినిమా ఇది. వర్ధన్ దేవరకొండ- విజయ్ దేవరకొండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్` అని పోస్టర్ పై ట్యాగ్ లైన్ వేశారు. ఇంతకీ ఇందులో ఎవరెవరి రహస్యాల్ని లీక్ చేస్తారో చూడాలి. ఫ్రెండ్స్ లోనే ఒకరి రహస్యాల్ని ఒకరు లీక్ చేస్తారేమో!
Please Read Disclaimer