నాకు మతిమరుపు అనుకున్నాడు.. నిఖిల్‌కి మెగాస్టార్ ఝలక్

0

నిఖిల్ సిద్ధార్థ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అతిథిగా హాజరయ్యారు.

ఆనందం తట్టుకోలేకపోయిన నిఖిల్

తనకెంతో ఇష్టమైన హీరో, ఆరాధ్య దైవం అయిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్‌గా రావడంతో ఆ ఆనందాన్ని నిఖిల్ తట్టుకోలేకపోయారు. చాలా ఎగ్టైట్‌మెంట్‌కు గురయ్యారు. ఒకానొక దశలో భావోద్వేగానికి కూడా లోనయ్యారు. చిరంజీవి తన గురించి మాట్లాడేటప్పుడు నిఖిల్ కళ్లలో నీళ్లు కనిపించాయి. ఆయన కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. చాలా కంగారుగా కూడా కనిపించారు.

చిరంజీవికి తన పేరు చెప్పడంతో..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ నిఖిల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘‘నేను ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి.. ఇప్పటి వరకు ఎగ్టైట్‌మెంట్‌లో ఏదేదో మాట్లాడేశాడు’’ అని చిరంజీవి అంటుండగానే.. ఆయన చెవిలో నిఖిల్ ఏదో చెప్పారు. దీంతో చిరంజీవి నవ్వుతూ.. ‘‘కంగారు, నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెబుతున్నాడు. చూడండి.. ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే నన్ను అనుమానిస్తున్నాడు. వయసు మీదపడింది కదా నా పేరు మరిచిపోతాడు అనుకుంటున్నాడేమో. అతను జస్ట్ నిఖిల్ అన్నాడు. నిఖిల్ సిద్ధార్థ అని నాకు గుర్తు. ఏది కరెక్ట్’’ అని ఝలక్ ఇచ్చారు చిరు.

నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది

నిఖిల్ సినిమాలు గతంలో ఒకటి రెండు చూశానని చిరంజీవి చెప్పారు. కానీ, నిఖిల్‌ను స్వయంగా చూసే అవకాశం ఎప్పుడూ కలగలేదన్నారు. ‘‘నిఖిల్‌ రూపంలో నాకు మరో తమ్ముడు, మరో శిష్యుడు దొరికాడని చాలా సంతోషం కలిగింది. ప్రేమించే వ్యక్తులు దొరకడం అనేది నేను సాధించే గొప్ప విజయం అని నేను ఫీలవుతాను. మనుషులను పొందడం అనేది నా క్రెడిబిలిటీ, బ్యాంక్ బ్యాలెన్స్‌గా ఫీలవుతాను. ఆ విధంగా నిఖిల్‌తో పరిచయం వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగింది అనుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి. అయితే, డబ్బులు ఎప్పుడు పంపిస్తావ్ అంటూ నిఖిల్‌కి మరో ఛలోక్తి విసిరారు చిరు. ప్రేమ రూపంలో పంపించూ అంటూ సరదాగా అన్నారు.

పూర్తి న్యాయం చేశాడు

ఎప్పుడూ చాక్లెట్ బోయ్‌గా లవర్ బోయ్‌గా ఉండే నిఖిల్.. అగ్రెసివ్‌గా యాక్షన్ హీరోగా తనను తాను తెర మీదికి ప్రెజెంట్ చేసుకోవడం అనేది బహుశా ఈ సినిమాతోనేనని తాను అనుకుంటున్నానని చిరంజీవి చెప్పారు. ఈ సినిమాలో హానెస్ట్ అండ్ సిన్సియర్ జర్నలిస్టుగా నిఖిల్ నటన అద్భుతమన్నారు. నిఖిల్ పాత్ర సినిమాకు ఎంతో కీలకమన్నారు. సినిమాలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పారు. మాస్ ఆడియన్స్‌ను అరించే విధంగా చేశాడని, ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుందన్నారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా అని చెప్పారు.
Please Read Disclaimer