సక్సెస్ ఫుల్ డైరెక్టరా.. ఎట్టెట్టా?

0

తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ మెహర్ రమేష్ పేరు దాదాపుగా తెలిసే ఉంటుంది. బడా స్టార్లతో సినిమాలు తెరకెక్కించిన మెహర్ రమేష్ ఇప్పుడు దర్శకత్వం కొనసాగించడం లేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రీసెంట్ గా మెహర్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉండడంతో బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి.

అయితే ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవారిలో కొందరు ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’ అనే టాగ్ లైన్ తగిలించి మరీ మెహర్ ను యథాశక్తి పొగిడారు. ఎలాపడితే అలా పొగిడితే మెహర్ ఊరుకుంటారేమో కానీ నెటిజన్లు ఊరుకోరుగా.. జోక్స్ వేయడం మొదలు పెట్టారు. మెహర్ దర్శకత్వం వహించిన సినిమాలు ‘బిల్లా’.. ‘కంత్రి’.. ‘షాడో’.. ‘శక్తి’. “అన్నీ సినిమాలు వేటికవే సాటి.. ఇతర సినిమాలతో లేదు అసలు పోటీ.. ఒకదాన్ని మించిన కళాఖండం మరొకటి.. చూసినవారికి ఇక తప్పదు చెల్లుచీటీ” అనే తరహాలో తగులుకున్నారు. ఇలాంటి కళాఖండాలు తెరకెక్కించిన దర్శకుడిని సక్సెస్ ఫుల్ అంటే.. నిజంగా హిట్స్ తీసిన వారిని ఏమని పిలవాలి? అంటూ కొందరు అమాయకంగా ప్రశ్నించారు.

నిజమే.. పింగళివారు చెప్పినట్టు అందుకోసం కొత్త పదాలు పుట్టించాలి. తెలుగు లోనే కాదు.. ఇంగ్లీష్ లో కూడా పుట్టించాలి. ఏతావాతా తేలేదేంటంటే ఏదైనా సందర్భం ఉంటే విష్ చేయాలి. అది మంచి పద్ధతి.. కానీ లేనిపోనీ విశేషణాలు ఆ అభినందనలకు జోడిస్తే అంతర్జాలికుల మనసు బాధ పడుతుంది.. వారు తగులుకుంటారు!
Please Read Disclaimer