నా సన్నిహితుడు బాలు త్వరగా కోలుకోవాలి: మోహన్ బాబు

0

దేశంలో ప్రస్తుతం విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి కోరల్లో మహానుభావులు సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం చిక్కుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి అటు సామాన్య ప్రజలను.. ఇటు సెలబ్రిటీలను ఎవరిని వదలకుండా ఆసుపత్రి పాలుచేస్తుంది. అయితే ప్రస్తుతం గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఐదవ తేది నుండి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేశవ్యాప్తంగా సినీ అభిమానులు కోరుతున్నారు. అలాగే ఆయన ఆరోగ్యం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతూ ప్రార్థిస్తున్నారు. ఇటీవలే బాలు ఆరోగ్యం కోసం చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించి.. బాలు ఆరోగ్యం గురించి.. అలాగే ఆయనతో పరిచయం సన్నిహత్యం ఆనాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. “బాలు నేను చాలా సన్నిహితులం. నేను బాలు అంటుంటాను. బాలు నన్ను శిశుపాల భక్త అంటుంటారు. ఎప్పుడో ఒకసారి మోహన్ బాబు అని పిలుస్తారు. చిన్నతనం నుంచే.. అంటే కాళహస్తిలో బడికి పోయే రోజుల్లో నుంచే మాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక సాధారణంగా గాయకులు ఎక్కువ శాతం ల్యాబ్ లోకి రాగానే ముందుగా డబ్బు తీసుకుంటారు. నేను ఎన్నో సినిమాలకు బాలుతో కలిసి పనిచేశాను. కానీ ఆయన ఏనాడూ డబ్బుకు ఆశ పడలేదు. ఒకానొక సందర్భంలో నేనే బాలసుబ్రహ్మణ్యం దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నా. భోజనం లేక ఆ అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు ఇంకా తీర్చలేదు. అప్పుడప్పుడూ అంటూ ఉంటాడు.. ఏమయ్యా ఆ 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికి అది కోటి అయి ఉంటుందని. బాలు అదే గొంతుతో సర్వ దేవతల గీతాలు పాడాడు. ఆ దేవతలందరి ఆశీస్సులతో ఆరోగ్యంగా తిరిగి రావాలని.. బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం” అంటూ పాత రోజులను నెమరు వేసుకున్నారు మోహన్ బాబు. ప్రస్తుతం సినీజనం కూడా మోహన్ బాబుతో ఏకీభవిస్తూ బాలు ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నారు.