స్టార్ రైటర్ చివరి రోజు ఎవరూ లేరు

0

టాలీవుడ్ లో రచయితల స్థానం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేమీ కాదు. రచయితల ధైన్యం గురించి నిరంతరం చర్చ సాగుతుంటుంది. రచయిత క్రియేటివిటీకి తగ్గ పారితోషికం ఏనాడూ లేదన్నది ప్రధాన ఆరోపణ. సాక్షాత్తూ రచయితల సంఘం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఈ పరిస్థితిపై నేడు హైదరాబాద్ ఎఫ్.ఎన్.సి.సిలో జరిగిన రచయితల రజతోత్సవ (25ఏళ్ల) వేడుకలో పలువురు దర్శకులు చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచాయి. రచయితగా బతకు వెళ్లదీయలేక దర్శకులు అవుతున్నారని మరోమారు ఈ వేదిక సాక్షిగా బట్టబయలైంది.

ఈ వేదికపైనే పలువురు టాప్ రైటర్స్ తో పని చేసిన సీనియర్ హీరో మంచు మోహన్ బాబు అన్న మాట కలవరపాటుకు గురి చేసింది. “మొట్టమొదట.. నేను అప్రెంటిస్ గా పనిచేసింది ఎం.ఎం. భట్.. దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు.. ఇలా ఎంతోమంది నాకు పరిచయం. అలాంటి ఆరుద్ర ఎన్నో సిల్వర్జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆయన చివరిరోజు ఏ నిర్మాత రాలేదు“ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఆరోజుల్లోనే రచయితను అవసరానికి ఉపయోగించుకున్న వాళ్లే! అన్న అర్థం ధ్వనించింది. ఇప్పటికీ ఆ సన్నివేశంలో ఎలాంటి మార్పు లేదు.

అంతా బాగానే ఉంది కానీ… రచయితల విషయంలో కొన్ని సందేహాలు అలానే ఉన్నాయి. పరుచూరి సోదరులు సహా ఉద్ధండులంతా ఈ వేదికపై ఉన్నారు కదా…! నవతరం రచయితల్లో ఉత్సాహం తగ్గకుండా.. వారి బతుకుల్లో వెలుగులు నింపేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్నదానిపైనా మరింత స్పష్టత ఇస్తే బావుండేది. రచయితల పారితోషికాల విషయంలో మినిమం గ్యారెంటీ కోసం ఉపాధి పరమైన సమస్య లేకుండా ఏం చేస్తున్నారు? అన్నదానిపైనా పరిష్కారాలతో కూడిన మరింత వివరణాత్మక ఈవెంట్ నిర్వహిస్తే బావుంటుందేమో!! రచయితల కథల్ని క్రియేటివిటీని కొట్టేయకుండా.. కాపీ రైట్ చట్టంపైనా అప్ కం యువరచయితల్లో అవగాహనా కార్యక్రమాలు ఏం చేస్తున్నారో వెల్లడించాల్సి ఉంది.
Please Read Disclaimer