వనభోజనాలే పరిష్కారమా?

0

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుకలుకల గురించి తెలిసిందే. మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ కు ఆహ్వానం లేకుండా.. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు రాజశేఖర్- జీవిత బృందం ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం నిర్వహించడం ఇంతకుముందు వివాదాస్పదమైంది. తనని పిలవకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారు అంటూ నరేష్ సీరియస్ అయ్యారు. దీనిపై హైదరాబాద్ సివిల్ కోర్టుకు వెళ్లారు. దీంతో మాలో గ్రూపు రాజకీయాలు పెచ్చురిల్లాయి. కమిటీలో ఇరు వర్గాలు ప్రస్తుతం ఎవరికి వారే యమునా తీరే అన్న తీరుగా ఉండడం సినీ పెద్దల వరకూ వెళ్లింది. రాజశేఖర్- జీవిత- హేమ తదితరులంతా నరేష్ కి వ్యతిరేక వర్గంలో ఉండడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలు మా అభివృద్ధికి.. సంక్షేమం కోసం అధ్యక్షుడు ఏమీ చెయ్యడం లేదని.. సొంత భవంతి నిర్మాణం కోసం నిధి కలెక్ట్ చేసే కార్యక్రమాలు చేయడం లేదని సభ్యులు ఆరోపించడం చర్చనీయాంశమైంది.

అసలు అంతూ దరీ లేని ఈ గొడవలు సద్ధుమణిగేది ఎప్పుడు? పరిష్కారం దొరుకుతుందా? ఇరువర్గాల్ని కలిపేది ఎలా? అంటే సమాధానం దొరకడం కష్టంగా ఉంది. అయితే ఈ వ్యవహారంపై `మా` ఫౌండర్ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి చాలా సీరియస్ అయ్యారని.. కలహాల కాపురం రుచించదని హితవు పలికారని ఇంతకుముందు వార్తలొచ్చాయి. అయినా ఇరు వర్గాలు తమ పంథాని వీడకపోవడం చర్చకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. మా సభ్యుల్లో కలతల్ని పరిష్కరించేందుకు కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ఏర్పాటు చేస్తున్నది జీవిత-రాజశేఖర్ బృందం. అది కూడా ఆ ఇద్దరూ వ్యక్తిగతంగా ఏర్పాటు చేస్తున్నది. మా అధికారిక కార్యక్రమం కాదని తెలుస్తోంది. దీంతో ఈ వనభోజనాలకు అధ్యక్షుడు నరేష్ అటెండవుతారా లేదా? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే మా సభ్యులందరికీ ఆహ్వానాలు పంపనున్నారని.. దాదాపు 400 మంది వనభోజనాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవుతారా లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇంత హడావుడిగా వన భోజనాలేంటి? అని ప్రశ్నిస్తే.. సమయాభావం వల్ల ఇలా చేస్తున్నామని.. కార్తీక మాసం ముగింపులో ఉందని జీవిత తెలిపారు. జీవిత- రాజశేఖర్ బృందం ఇలా వ్యక్తిగతంగా వనభోజనాలు ఏర్పాటు చేస్తుండడంపై సీనియర్ నరేష్ స్పందన ఏమిటి? అన్నది చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home