రజనీ-మురుగదాస్..ఆ సినిమా అనుకుని క్యాన్సిల్ చేశారట

0

మురుగదాస్ పదిహేనేళ్ల కిందటే తమిళంలో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక రజనీకాంత్ స్టార్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరి కెరీర్లు పీక్స్లో ఉన్న సమయంలో సినిమా చేస్తే దాని రేంజే వేరుగా ఉండేది. ఒక పదేళ్ల కిందట అయితే ఈ కాంబినేషన్ పేలిపోయేది. కానీ ఇద్దరూ స్ట్రగుల్లో ఉన్న సమయంలో ఇప్పుడు దర్బార్ మూవీతో జట్టు కట్టారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మామూలుగానే అనిపించింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఐతే నిజానికి రజనీ-మురుగదాస్ ఇద్దరూ కూడా మంచి ఫాంలో ఉండగానే సినిమా చేయాలనుకున్నారట. దానికి ఓ కథ కూడా అనుకున్నారట. కానీ అనివార్య కారణాలతో అది కార్యరూపం దాల్చలేదట. ఆ మూవీ చంద్రముఖికి స్పిన్ ఆఫ్ అని మురుగదాస్ వెల్లడించడం విశేషం.

స్పిన్ ఆఫ్ మూవీ అంటే సీక్వెల్ కాని సీక్వెల్. ఒక మూవీలో కీలకమైన ఒకట్రెండు పాత్రలు తీసుకుని.. ఒరిజినల్ లోని ఫ్లేవర్ తోనే కొత్త కథను అల్లి సినిమా తీస్తారు. రజనీ కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చంద్రముఖి బాగా నచ్చడంతో అందులో రజనీ క్యారెక్టర్ ను తీసుకుని స్పిన్ ఆఫ్ చేయాలని మురుగదాస్ అనుకున్నాడట. ఆ ఐడియా చెబితే రజనీ చాలా ఎగ్జైట్ కూడా అయ్యాడట. సన్ పిక్చర్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మించడానికి కూడా రెడీ అయ్యారట. ఐతే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ సినిమా ఆపేసినట్లు మురుగదాస్ వెల్లడించాడు. చంద్రముఖి నిర్మాణ సంస్థ నుంచి హక్కులు తీసుకోవడంతో పాటు ఇంకొన్ని ఇబ్బందులు కూడా కనిపించాయని.. అందుకే సినిమాను ఆపేశామని.. తర్వాత కొన్నేళ్లకు దర్బార్ కథను రజనీకి చెప్పానని.. కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా ఏళ్లు పట్టేసిందని మురుగదాస్ తెలిపాడు.
Please Read Disclaimer