మహిళలపై నోరుజారిన ముఖేష్ ఖన్నా సారీ

0

బాలీవుడ్ సీనియర్ హీరో ముఖేష్ ఖన్నా అంటే తెలియనవారు ఉండరు. 70వ దశకంలో తన సినిమాలతో స్టార్ డం సంపాదించారాయన.. తాజాగా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.

‘మీటూ’ ఉద్యమంపై ముఖేష్ ఖన్నా నోరుజారి చిక్కుల్లో పడ్డారు. సమాజంలోని ప్రతి అంశంలోనూ తాము పురుషులతో సమానమని భావించడం వల్లే మహిళలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని.. ఆడవాళ్లు ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడే ‘మీటూ’ ఉద్యమం మొదలైందని ముఖేష్ ఖన్నా ఆడిపోసుకున్నారు. `మీ టూ` ఉద్యమానికి బాధ్యత వహించాల్సింది మహిళలలేనని వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మంచిదని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

ముఖేష్ ఖన్నా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ముఖ్యంగా మహిళాలోకం భగ్గుమంది. ప్రముఖ నటి రాధిక గాయని లాంటి వాళ్లు ముఖేష్ పై నిప్పులు చెరిగారు. మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టి దుమ్మెత్తిపోశారు.

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ముఖేష్ ఖన్నా తన వ్యాఖ్యలపై స్పందించారు. తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. మహిళలను కించపరచడం తన ఉద్దేశం కాదని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని ముఖేష్ పేర్కొన్నారు. మహిళలను గౌరవించే వారిలో తాను ముందు వరుసలో ఉంటానని తెలిపారు.