డిజిటల్ వీక్షణకు మల్టీప్లెక్స్ బాదుడే కారణం?

0

చేతులు కాలాకే ఆకులు పట్టుకోవడం మనకు అలవాటు. విభజనకు ముందు పాలకులు లైట్ తీస్కోవడంతో మల్టీప్లెక్స్ కల్చర్ లో దారుణమైన ధరల స్థిరీకరణ జరిగింది. పావలాకు కొనాల్సినది ఐదు రూపాయలు పెడితే కానీ అక్కడ కుదరని పరిస్థితి. మెయింటనెన్స్ పేరుతో పదింతలు ధరలు పెంచి ఇష్టానుసారం అమ్మేయడం ఈ కల్చర్ లో అలవాటైపోయింది. దీంతో ఇప్పుడు దిగి రావాలంటే దిగొస్తారా? ఇదోరకం దర్జా దొంగతనంలా తయారైంది. దొరగారి దోపిడీకి రాజుగారే సాగిలబడినట్టుగా ఉంది వ్యవహారం.

మల్టీప్లెక్సుల్లో దశాబ్ధాల పాటు పార్కింగ్ ఫీజు దోపిడీ జరిగింది. కోట్లాది రూపాయల్ని యాజమాన్యాలు ఆర్జించాయి. అయితే ఏపీ తెలంగాణ డివైడ్ తర్వాత సీన్ మారింది. మల్టీప్లెక్స్ రాజ్యానికి అంతో ఇంతో చిల్లు పెట్టే కృతువు మొదలైంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో సింగిల్ థియేటర్లలోనూ టిక్కెట్టు బాదుడు సహా పార్కింగ్ బాదుడుపైనా తెరాస ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా పార్కింగ్ ఫీజుకు అడ్డుకట్ట వేయగలిగారు. ఒకవేళ ఇది కనిపెట్టి తెరాస ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే ఇప్పటికే ఏ రేంజులో బాదేవారో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఆన్ లైన్ టిక్కెట్టు బాదుడు.. థియేటర్లలో తిండి పదార్థాల బాదుడు యథాతథంగా ఉన్నాయి. దీనికి మాత్రం ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. ఇంతకుముందు అధికారులతో సమీక్షించి కరెక్షన్ కి వెళుతానన్న తెరాస ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పని చేయడంలో విఫలమైంది. హైదరాబాద్ లో ఏ మల్టీప్లెక్స్ థియేటర్ల లోనూ తిండి పదార్థాల ధరలు తగ్గలేదు. యథావిధిగా అవే ధరలు. బాదుడే బాదుడు. కానీ ఎన్నాళ్లు ఇలా? ఏదీ మార్పు.. కోకోకోలా- పాప్ కార్న్ కి రూ.600 ధర.. మరీ ఇంత దారుణమా?

రూ.20 కే వచ్చే కార్న్.. 30కి దక్కే కోక్.. పది రెట్లు పెంచి అమ్ముతారా? ఇదెక్కడి అన్యాయం? ఇక ఆన్ లైన్ లో టిక్కెట్టు బాదుడుకు విరుగుడు కనిపెడతామని మంత్రి గారి బంధువు అందుకోసం పూనుకున్నారని వార్తలొచ్చాయి. ఆయన ఓ కొత్త వెబ్ సైట్ పెట్టి ప్రభుత్వం తరపున అదుపులోకి తెస్తారని అన్నారు. కానీ ఒక్కో టిక్కెట్టుపై ఆ పన్ను ఈ పన్ను ప్రాసెసింగ్ ఫీజు అంటూ రూ. 40-50 అదనపు బాదుడు ఇప్పటికీ తప్పడం లేదు. కారణం ఏదైనా ఇది పెను పరిణామాలకు కారణమవుతోంది. ఒకరకంగా ఈ ధరల బాదుడు వల్లనే సామాన్యుడు థియేటర్ల జోలికి వెళ్లడం లేదు. కుటుంబ సమేతంగా జనం డిజిటల్ వీక్షణకే అలవాటు పడుతున్నాడు. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ దూకుడు అందుకే కొనసాగుతుందని అర్థమవుతోంది. ఈ పరిణామం మునుముందు టాలీవుడ్ ని ఎటువైపు తీసుకెళుతుందో?
Please Read Disclaimer